బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్.. కన్నీరు పెడుతున్న కర్షకుడు
ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత నివ్వడం లేదంటూ తెలంగాణ మంత్రులు ఆరోపిస్తుంటే.. కేంద్రం పెద్దలేమో తెలంగాణ ప్రభుత్వానికి ధాన్యం సేకరణ చేతకాక మాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పెంచామని, ఇప్పటికీ నిర్ణీత ధాన్యం సేకరణ తెలంగాణ ప్రభుత్వం చేపట్టలేకపోయిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల వెల్లడించారు. అంతేకాకుండా వర్షాకాలంలో పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు సైతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను రైతులకు అందకుండా అడ్డుకుంటున్నారని టీఆర్ఎస్ నేతలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. యాసంగిలో వరి వేయవద్దని.. అధిక దిగుబడి ఇచ్చే పంటలు వేయాలంటూ కేసీఆర్ రైతులకు పిలుపునిచ్చారు. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత లేకుండా చేసే వ్యాఖ్యలపై గందరగోళంలో పడిన రైతన్న ఎవరి మాట వినాలో అర్థకాక ఆయోమయంలో ఉన్నాడు. కాంగ్రెస్ నేతలు సైతం రైతులకు న్యాయం చేయాలంటూ మొన్నటికి మొన్న ఇందిరాపార్క్ వద్ద కర్షకుల కోసం కాంగ్రెస్ పేరుతో వరి దీక్షలు చేసింది. ఏ రాజకీయ పార్టీ ఏమీ చేసినా.. పెద్దపెద్ద నాయకులు వేదికలపై ఉపన్యాసాలు ఇచ్చినా.. రైతన్నకు క్లారిటీ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై బీజేపీ వర్సెస్ టీఆర్స్ మాటల యుద్ధం నడుస్తోంటే.. వీరి మాటలు విన్న కర్షకుడు కన్నీరు పెట్టుకుంటున్నాడు.