ఏపీని మరచిపో... ?

Satya
ఏపీ ఎక్కడ ఉంది. ఈ దేశంలోనే ఉంది. అయితేనేంటి దాని అగచాట్లు అది పడాల్సిందే. నాడు ఉమ్మడి మద్రాస్ స్టేట్ నుంచి విడదీసినా, నాటి హైదరాబాద్ స్టేట్ తో కలిపినా మళ్లీ విడదీసినా అంతా కేంద్ర పెద్దల ఇష్టం. ఏపీ బాగోగులు మాత్రం ఎవరికీ పట్టవు.
విభజన జరిగి ఏడేళ్ళుగా ఏపీ నానా అవస్థలూ పడుతోంది. ఈ రోజుకీ రాజధాని ఇదీ అని చెప్పుకోలేని దురవస్థలో ఉంది. ఇక విభజన హామీలు ఒక్కోటీ కరిగిపోతున్నాయి. నాడు ఎన్నో చెప్పి ఏపీని విడదీశారు. అందులో ముఖ్యమైనది ప్రత్యేక హోదా. అలాగే కేంద్రం పూర్తి నిధులతో పోలవరం పూర్తి, ఇక రాజధానిని ఢిల్లీకి మించినది కట్టిస్తామని, దానికి కేంద్ర సాయం భారీ ఎత్తున ఉంటుందని చెప్పారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు.
అలాగే ఏపీకి ఉన్న రెవిన్యూ లోటుని పూడ్చుతామని, ఉమ్మడి ఆస్తులను లెక్క వేసి మరీ ఏపీకి రావాల్సినవి అప్పగిస్తామని కూడా చాలా చెప్పారు. చివరికి తేలిందేంటి అంటే నిండు పార్లమెంట్ లో ఏపీ అప్పుల కుప్ప అని కేంద్ర మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. ఏపీకి ఈ స్థితికి రావడానికి కారకులు ఎవరు అని సమీక్ష ఎక్కడా లేదు. ఇంకో వైపు చూస్తే ఒక్కో హామీ అలా కరిగిపోతోంది. చివరికి ప్రధాని స్వయంగా విశాఖ వచ్చి ఇచ్చిన రైల్వే జోన్ ప్రకటన కూడా కేంద్ర మంత్రి త్రొసిరాజంటున్నారు అంటే ఏపీని మరచిపోవాలనే నిర్ణయించుకున్నారా అన్న ప్రశ్న వస్తోంది.
బీజేపీ ఏలుబడి కింద ఏపీ లేదు, కనీసం సమీప భవిష్యత్తులో కూడా ఏపీలో బీజేపీ గెలుస్తుంది అన్న ఆశ లేదు, దాంతోనే ఏపీ అంటే చిన్న చూపు చూస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది. ఇంకో వైపు చూసుకుంటే ఏపీలో రాజకీయ నాయకత్వం కూడా కడు బలహీనంగా ఉందని, అక్కడ రాజకీయ  పక్షాలు వారిలో వారే తగవులు ఆడుకుంటూ తమ మీదకు రారు అన్న ధీమా ఏదో ఉండి ఉండాలి. అందుకే ఇచ్చిన హామీ, చేసిన ప్రకటనను కూడా వెనక్కి తీసేసుకుంటున్నారు అనిపిస్తోంది. మొత్తానికి ఏపీని అన్ని  విధాలుగా అన్యాయం చేస్తున్నారు అన్నదే మేధావుల భావన, మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే జవాబు దొరకదు, ఏపీ జనాలు అలా అవస్థలు పడుతూండడమే అన్న మాట అయితే ఉంది మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: