ఈ లక్షణాలుంటే ఒమిక్రాన్ సోకినట్టే..!

NAGARJUNA NAKKA
ఒమిక్రాన్ వేరియంట్ గురించి ప్రజలు భయపడాల్సిన పని లేదని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ఒమిక్రాన్ సోకిన వారిలో తీవ్ర లక్షణాలు కనిపించడంలేదనీ.. ఒళ్లు నొప్పులు, తలనొప్పి, నీరసం లాంటివి ఉంటున్నాయన్నారు. వ్యాధి తీవ్రత సంపూర్ణంగా తెలిసేందుకు మరో వారం పడుతుందని చెప్పారు. రెండు రోజుల్లో దేశంలో కరోనా కేసులు పెరుగుతాయన్నారు. ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు పెరగడం లేదని వెల్లడించారు.
రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దాస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న కారణంగా లాక్ డౌన్ విధించే అవకాశం ఉందన్న వార్తలపై కూడా స్పందించిన ఆయన.. రాబోయే రోజుల్లో ఎలాంటి లాక్ డౌన్ లు ఉండవని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తెలిపేందుకు మరో వారం రోజులు సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు రేపోమాపో తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ పాజిటివ్ రావొచ్చని వైద్య శాఖ తెలిపింది. ఎలాంటి పరిస్థితులనైనా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారిలో 13మందికి కరోనా సోకగా.. వారి శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్స్ కు పంపామని తెలిపింది. త్వరలోనే ఫలితాలు వస్తాయని చెప్పింది. జనవరిలో కరోనా కేసులు పెరిగి.. ఫిబ్రవరిలో పీక్ స్టేజ్ కు వెళ్లే అవకాశముందని వైద్యశాఖ స్పష్టం చేసింది.
మరోవైపు మన దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24గంటల్లో 8వేల 895పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక నిన్న కరోనాతో 2వేల 796మంది మరణించారు. అలాగే గత 24గంటల్లో 6వేల 918మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 99వేల 155యాక్టివ్ కేసులున్నాయి. అటు గత 24గంటల్లో కోటి మందికి పైగా వ్యాక్సిన్లు ఇవ్వగా.. మొత్తం ఇప్పటి వరకు 127.61కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: