శ్రీకాకుళం రాజకీయాలలో చెరగని స్థానం ఆయనది. చెదరని విశిష్ట వ్యక్తిత్వం కూడా ఆయనదే! భయం మరియు ఆందోళనకు దూరంగా ఉండే ధర్మాన కృష్ణ దాసు ఇప్పుడెందుకని డైలమాకు ప్రాధాన్యం ఇస్తున్నారని? డిప్యూటీ సీఎం హోదాలోచేయాల్సినంత చేయాలి. సాధించాల్సిన ప్రగతి సాధించాలి. ప్రయాణం సాగించాలి. కానీ ఆయన వీటిని పట్టించుకోకుండా భయపడుతున్నారు. లేదా ఎన్నడూలేని ఆందోళనలో ఉంటున్నారు. ఎందుకంటే ఆయనకు వైసీపీలోనే మంచి మార్కులు పడడం లేదు. ఇంకా చెప్పాలంటే వైసీపీ సర్కారు అంటేనే ప్రజల దగ్గర మంచి మార్కులేవీ రావడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక తికమకపడుతున్నారు కొందరు. బయటకు చెప్పుకోలేక, లోపల దాచుకోలేక నానా అవస్థలూ పడుతున్నారు కొందరు. అభివృద్ధి పేరిట చేయాల్సిన పనులేవో ఇప్పటిదాకా తేలనేలేదు. కాలం మాత్రం హారతి కర్పూరంలా రెండున్నరేళ్లు కరిగిపోయింది. ఇంకా మిగిలిన రెండున్నరేళ్లలో ఎలక్షన్ ఏడాది తీసేయ్యగా ఒకటిన్నర ఏడాది మాత్రమే. ఇంత తక్కువ కాలంలో ఆయనేం చేస్తారని? ఏం సాధిస్తారని.? అన్నది ఇప్పుడొక ప్రశ్నగా మారింది.
ఈ క్రమంలో ఆయనకు ఉన్న ఏకైక మార్గం మళ్లీ తన నాయకత్వంలోనే క్యాడర్ ను పరుగులు పెట్టించడం..మళ్లీ తన నాయకత్వంలోనే అనుకున్నది సాధించడం. అందుకే ఆయన ఇప్పుడు రూటు మార్చారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రకటించారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో కొడుకు కృష్ణ చైతన్య పోటీ చేస్తాడని అంతా అనుకున్నారు. ఆయన కూడా ఇదే మాట చెబుతూ వచ్చారు. కానీ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతానికి పోలాకి జెడ్పీటీసీగా ఎన్నికయిన ఆయనను అలానే ఉంచి, తన రాజకీయ ప్రయాణం కొనసాగించే యోచనకు సిద్ధం అవుతున్నారు. అందుకు నియోజకవర్గంలో అసంతృప్తతకు తావు లేకుండా ఉండేలా దిగువ శ్రేణి నాయకత్వాలతో భేటీ అయ్యేందుకు వారిని ప్రోత్సహించేందుకు యోచిస్తున్నారు. కేవలం సంక్షేమంను నమ్ముకుని, డబ్బులు పంచడం ద్వారా ఫలితమేమీ ఉండదని కార్యకర్తలనే బాహాటంగా మాట్లాడుతుంటే విమర్శిస్తుంటే ఇక వైసీపీ సర్కారు ఏం చేయగలదని? గ్రామాలలో ఇన్నాళ్లలా రాజకీయాలు లేవు. ఊరికి రోడ్డు రాకున్నా, బడికి సున్నం వేయకపోయినా, వీధి దీపం వెలగక పోయినా ఎక్కడికక్కడ నిలదీతలకు సిద్ధం అయ్యేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అందుకే వారి ప్రాధాన్యాలు కూడా మారిపోయాయి. ఒకప్పుడు డబ్బు తీసుకుని ఓటేసి తరువాత మిన్నకుండే వారు. ఇప్పుడలా కాదు ఎన్నికల తరువాత
ఎవరేంటి ఎవరు ఎంత వరకూ హామీలు నిలబెట్టారు వంటివెన్నో పరిగణించి మరీ! మళ్లీ ఓటేసేందుకు పునరాలోచన చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నరసన్నపేట నియోజకవర్గంలో అస్సలు ధర్మాన కృష్ణదాసుకు పరిణామాలు అనుకూలంగా లేవనే తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ మరింత పుంజుకునేందుకు బగ్గు కుటుంబాన్ని కాకుండా కింజరాపు కుటుంబాన్ని రంగంలోకి దింపాలని యోచిస్తున్నారు. రాజకీయాల్లో ధర్మాన, కింజరాపు కుటుంబాలకు ఉన్న వైరం ఈ సారి ఆసక్తికరంగా మారనుంది.
కింజరాపు ప్రభాకర్ నాయుడు కానీ కింజరాపు సురేశ్ కానీ ఈ సారి బరిలోకి దిగనున్నారు. ప్రభాకర్ నాయుడు దివంగత నేత ఎర్రన్నాయుడు తమ్ముడు కాగా, సురేశ్ నాయుడు ఎర్రన్నాయుడి తమ్ముడు హరి వర ప్రసాద్ కొడుకు. ఈ క్రమంలోనే సురేశ్ అభ్యర్థిత్వంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్న కింజరాపు కుటుంంబం ఇప్పటి నుంచే నరసన్నపేటలో బలపడేందుకు ఉన్న మార్గాలన్నింటిపై ఫోకస్ చేస్తూ పనిచేస్తోంది క్షేత్ర స్థాయిలో! ఎలానూ అటు అచ్చెన్న ఇటు రామూ అండగా ఉంటారు కనుక
ఆయన ఈ సారి దిగ్గజ నేత ధర్మాన కృష్ణదాసుపై విజయం సాధించేందుకు కుర్ర తరంగం సురేశ్ బాగా సిద్ధం అవుతున్నారు అని
టాక్.