వరద ప్రభావిత ప్రాంతాలకు అందుకే వెళ్లలేదంటున్న సీఎం జగన్..!

NAGARJUNA NAKKA
అధిక వ‌ర్షాలు వ‌ర‌ద‌ల‌పై సీఎం జ‌గ‌న్ పలు కీలక విషయాలు వెల్లడించారు. పింఛ తెగిపోయి ఒక్కాసారిగా నీరు అన్న‌మ‌య్య‌కు రావ‌డంతోనే పరిస్ధితి ప్ర‌మాద‌క‌రంగా మారినట్టు చెప్పారు. అన్న‌మయ్య ప్రాజెక్టు డిశ్చార్జ్ సామ‌ర్ధ్యం 2ల‌క్ష‌ల 17 వేల క్యూసెక్కులు కాగా... నవంబర్ 19 తేదీ తెల్లవారు జామున 3.2 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీరు వ‌చ్చిందన్నారు. కొన్ని గంటల వ్య‌వ‌ధిలోనే ఈ ప‌రిస్ధితి ఏర్ప‌డి ప్రమాదకరంగా మారినట్టు చెప్పారు. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో కూడా జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉన్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. అధికారులు 18వ తేదీ అన్న‌మ‌య్య కింద కుడివైపు ఉన్న పున్న‌పోత్తూరు, దిగుమందూరు, కేశాంబ‌వ‌రం, గుండ్లూరు, హేమాద్రిపురం  గ్రామాల ప్ర‌జ‌ల‌కు ముందుగానే స‌మాచారమిచ్చినట్టు చెప్పుకొచ్చారు. 1250 కుటుంబాల‌ను అప్ర‌మ‌త్తం చేసినట్టు సీం చెప్పారు. 400కుటుంబాల‌ను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు.
ఇక నంద‌లూరు దగ్గర బ్రిడ్జిపై నుండి వెళుతున్న నాలుగు బ‌స్సులు ముంపునకు గురయ్యాయని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 10 మంది చనిపోయారనీ..  అన్న‌మ‌య్య ప్రాజెక్టు దిగువ‌న ఉన్న గ్రామాల్లో కార్తీక‌ మాసం సంద‌ర్భంగా కొంద‌రు పూజ‌లు చేస్తుండ‌గా ప్రమాదానికి గురైయ్యారని చెప్పారు. ఈ రెండు ఘ‌ట‌న‌ల్లో 20మంది వ‌ర‌కూ గ‌ల్లంతై.. మ‌ర‌ణించారని చెప్పారు. శుక్ర‌వారం ఉద‌యం నుంచే అన్ని గ్రామాల్లో తాగునీరు, ఆహరం అందించామని స్పష్టం చేశారు సీఎం జగన్. శనివారం ఏరియ‌ల్ సర్వేద్వారా ముంపు ప్రాంతాల‌ను చూశామన్నారు. ఎప్ప‌టిక‌ప్ప‌డు క‌లెక్ట‌ర్ ల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించినట్టు చెప్పారు.  
తాను గాలిలోనే వ‌చ్చి గాలిలోనే పోతాన‌నీ ప్రతిపక్ష నేతలు అంటున్నట్టు చెప్పారు సీఎం జగన్. ఎక్క‌డో ఓ చోట క‌నుమ‌రుగు అవుతాన‌నీ.. త‌న‌ను వ్య‌తిరేఖించిన వైఎస్ఆర్ కాల‌గ‌ర్భంలో క‌లిసి పోయార‌ని అంటున్న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడి సంస్కానికి నమస్కారాలు అన్నారు సీఎం. క‌డ‌ప‌ మీద తనకు మ‌రికొంత ఎక్కువ‌గానే ప్రేమ ఉందనీ.. తాను వెళ్దాం అనుకుంటే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని సీనియర్ అధికారులు సలహా ఇచ్చినట్టు చెప్పారు.  ఇపుడు వరద బాధితులను ఆదుకోవడం చాలా ముఖ్యమన్నారు. మంత్రులు, అధికారుల‌ను సహాయక చర్యల్లో నిమగ్నం చేసినట్టు చెప్పారు.   ముఖ్య‌మంత్రి వెళితే వ‌ర‌ద‌ బాధితులను అధికారులు వ‌దిలేస్తారని అభిప్రాయ పడ్డారు సీఎం జగన్. సహాయ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత వరద ప్రభావిత ప్రాంతాలకు తాను వెళ్తున్నట్టు చెప్పారు సీఎం జగన్. నిధులకు ఎక్కడా కొరత రాకూడదని 84 కోట్లు నాలుగు జిల్లాలకు ఇచ్చినట్టు చెప్పారు. బాధితుల కుటుంబాలకు తక్షణ ఆర్ధిక సాయంగా 2 వేల రూపాయలు, బియ్యం, నిత్యావసరాలు ఇచ్చామన్నారు.  వరదల కారణంగా మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల పరిహారాన్ని కూడా శరవేగంగా అందించినట్టు చెప్పారు. గల్లంతై ఆచూకీ లభ్యం కానీ వారి విషయంలోనూ పరిహారాన్ని అందించామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: