ధర్మాన దిక్కారా స్వరం వెనుక ఆంతర్యం ఏమిటి..?

MOHAN BABU
రాజకీయాల్లో సీనియర్ గా పేరున్న ఆ నాయకుడు ఇప్పుడు సొంత పార్టీలోనే దిక్కార స్వరం వినిపిస్తున్నారా..? స్వపక్షం లోనే విపక్ష నేతగా మారుతున్నారా..? ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. సిక్కోలు రాజకీయ వర్గాలు ఇప్పటికీ ఆయనను మంత్రిగానే సంబోధిస్తారు.  అలాంటి నేత కాంగ్రెస్ ను వీడి వైసీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. అయితే అంతటి సీనియర్ నేత కి సొంత క్యాడర్ నుంచే తలనొప్పులు వస్తుండడంతో ఒక్కసారిగా రోడ్డెక్కారు. అంతటితో ఆగకుండా ఏకంగా ప్రభుత్వంలోనే సీనియర్ ఉన్నతాధికారుల పైనే విరుచుకుపడ్డారు. ఈ మధ్యకాలంలోనే ప్రెస్ మీట్ లు గానీ,ఇతర సభల్లో గానీ ఆయన మాట్లాడే తీరు అధికార పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోందట. ఎవరైనా మీటింగులు పెట్టాలంటే పార్టీ ఆఫీస్ లోనే పెట్టాలని డిప్యూటీ సీఎం తాకీదులు ఇచ్చిన వాటిని పట్టించుకోక సొంతంగా ఏర్పాటు చేసుకున్న టౌన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేయడం వైసిపి జిల్లా నాయకులకు మింగుడు పట్టడం లేదట.

కాంట్రాక్టర్ల వాదనను ప్రస్తావిస్తూ ఓ రేంజులో అధికారులను టార్గెట్ చేసిన ధర్మాన ప్రసాదరావు స్వపక్షంలో ప్రతిపక్షంగా మారుతున్నారని క్యాడర్ మాట్లాడుకుంటుంది. కిందిస్థాయి క్యాడర్ లో అసహనం, సర్పంచిగా గెలిచిన వాళ్లకు అధికారం లేకపోవడం, ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారే తప్ప ప్రజలకు వీరి వల్ల ఏం ఉపయోగం అనే అర్థం   వచ్చేలా మాట్లాడటంపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన కొన్ని పరిణామాల తో ధర్మాన వైసిపిలో చేరాల్సి వచ్చింది. జగన్ పాదయాత్ర కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఈయనే చూసుకున్నారు. టిడిపికి కంచుకోటగా ఉన్న ఈ జిల్లా నుంచి 8 సీట్లు గెలిచే విధంగా పథక రచన చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మానకు మంచి పదవి  వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా తన అన్న ధర్మాన కృష్ణప్రసాద్ కు పదవి వరించింది. తనకు అవకాశం వస్తుందేమోనని వెయిట్ చేసిన ధర్మాన లో అసహనం మొదలై అధికార యంత్రాంగం తీరుపై వారిని పట్టించుకోని నాయకత్వంపై ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన మాట్లాడుతున్నారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి రాజకీయాల్లో సీనియర్ నేతగా ఏ విషయం పైన అయినా సరే అనర్గళంగా మాట్లాడే ఓ మంచి వక్తను ఇలా ఖాళీగా ఉంచడం పార్టీకి మంచిది కాదని ఆయన అభిమానులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో జగన్ మదిలో ధర్మానపై ఎలాంటి అభిప్రాయం ఉందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: