కేసీఆర్ టాక్స్ : పోరు తెలంగాణ ఏమయింద్రా?

RATNA KISHORE
సెంటిమెంట్ రాజ‌కీయాల‌ను న‌డ‌పడంలో కేసీఆర్ ను మించిన నాయ‌కులే లేరు. మాట చాతుర్యం కారణంగా ఆయ‌న మిగిలిన నాయ‌కుల క‌న్నా వేగంగా దూసుకుపోగ‌ల‌రు. త‌న దైన మాయాజాలంతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్ట‌నూ గ‌ల‌రు. కేంద్రంతో క‌య్యం అని ఇక్క‌డ బాగానే చెప్పిన‌ప్ప‌టికీ ఆ రోజు మాదిరిగా కేసీఆర్ తో యువ‌కులు న‌డుస్తారా అన్న‌ది ఓ పెద్ద సందేహం. ఇన్నేళ్లు కేంద్రం ఇవ్వ‌ని వాటిపై, అమ‌లుకు నోచుకోని విభ‌జ‌న చ‌ట్టంపై, ముఖ్యంగా కేంద్ర తీసుకువ‌చ్చిన న‌ల్ల చ‌ట్టాల‌పై మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడెందుకు మాట్లాడారో?



తెలంగాణ కోసం ఎంద‌రో ప్రాణాలు కోల్పోయారు. యువ‌కులు ఎంద‌రో త‌మ విలువ‌యిన జీవితాల‌ను త్యాగం చేసి ఉద్య‌మంలో ఆ రోజు న‌డిచారు. కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేర‌కు ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌కు వీరోచితంగా పోరాడారు. పోలీసు బెద‌రింపుల‌కు త‌లొగ్గ‌క., స‌మైక్య పాల‌కుల ఒత్తిళ్ల‌కు అద‌ర‌క బెద‌రక ఆ రోజు  పెను ఉద్య‌మ‌మే చేశారు. మిలియ‌న్ మార్చ్ పేరిట క‌దం తొక్కారు. ఇంకా ఎన్నో పోరాటాలు నిర‌స‌న‌లు ధ‌ర్నాలు రాస్తారోకోలు చేసి త‌మ క‌ల‌లను సాకారం చేసుకునేందుకు అహ‌ర‌హం శ్ర‌మించారు. శ‌క్తి వంచ‌న లేకుండా ఆ రోజు చేసిన కృషి ఫ‌లితంగా ప్ర‌త్యేక  రాష్ట్రం ఏర్పాటైంది. క‌ల‌ల తెలంగాణ సాక్షాత్కారం అయింది. అంతా అనుకున్నవిధం గానే ఇంటి పార్టీకే ఓట‌రు ప‌ట్టం క‌ట్టాడు. రెండు సార్లు కూడా ఓట‌రు గులాబీ బాస్ చెప్పిన విధంగానే న‌డుచుకుంటాన‌ని స‌మ్మ‌తించాడు. ఆ విధంగా కేసీఆర్ కుటుంబం రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ గా కాంగ్రెస్ ను ఎన్న‌టి కీ ప్ర‌జ‌లు గుర్తు పెట్టుకోవాలి కానీ ఇక్క‌డ కేసీఆర్ ఆ క్రెడిట్ ను కొట్టేసి త‌నదైన రాజ‌కీయం ఒక‌టి న‌డిపారు. ఫలితంగా తెలంగాణ ఇచ్చిన పార్టీ క‌న్నా తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ మంచి గుర్తింపునే కొట్టేసింది.

రాజ‌కీయం ఎలా ఉన్నా ఏడేళ్ల త‌రువాత కేసీఆర్ మ‌ళ్లీ ఉద్య‌మ గొంతుక వినిపిస్తాను అని అంటున్నారు. మ‌ళ్లీ దేశ రాజ‌ధానిలో పోరుకు సిద్ధం అని చెబుతున్నారు. త‌న‌తో పాటు ఎమ్మెల్యేలూ, ఎంపీలూ ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధులూ ఈ పోరుకు సిద్ధం కావాల‌ని నిన్న‌టి వేళ చెప్పారు. పిలుపునిచ్చారు. వాస్త‌వానికి ఆ రోజు ఉన్న తెలంగాణ సెంటిమెంట్ ఇవాళ లేదు. క‌లిసి ఉన్నా విడిపోయినా సామాన్య ప్ర‌జ‌ల‌కు ఒరిగిందేమీ లేదు. భౌగోళిక విభ‌జ‌న కార‌ణంగా కేసీఆర్ కుటుంబం బాగానే ల‌బ్ధి అందుకుంది. తరుచూ ఉప ఎన్నిక‌ల డ్రామా ఒక‌టి న‌డుపుతూ ప్ర‌జా స‌మ‌స్య‌లను గాలికి వ‌దిలేసింది అన్న ఆరోప‌ణ‌లు కొన్ని అందుకుంటోంది. అయినా కూడా కేసీఆర్ ఇవేవీ ప‌ట్టించుకోకుండా కొట్లాట‌కు తాను సిద్ధ‌మేన‌ని, కేంద్రంతో అమీతుమీ తేల్చుకుంటాన‌ని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: