ఏపీ రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. ఇప్పుడు స్టేట్ అటెన్షన్ మొత్తం కుప్పం మీదే ఉంది. కుప్పంలో రాజకీయం కుతకుత ఉడికి పోతోంది. టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతుండడంతో ఏపీ ఫోకస్ అంతా అక్కడికే షిఫ్ట్ అయింది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కుప్పం బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. తనను కుప్పం కు రావద్దని చెప్పడానికి చంద్రబాబు కు ఏం అధికారం ఉందని ప్రశ్నించాడు. 35 ఏళ్లుగా కుప్పం నుంచి గెలుస్తున్న బాబు ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
ఉపాధి లేక కుప్పం నుంచి 25 వేల మంది వలస వెళ్లిపోయారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎలక్షన్ జరిగే లోగా కుప్పానికి హంద్రీనీవా నీళ్లు తెస్తామన్నారు. 14వ వార్డు టిడిపి ఎస్సి అభ్యర్థి వెంకటేష్ పై జరిగిన దాడి కుప్పం లో ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేసింది. దుండగులు అతని నామినేషన్ పత్రాలను కూడా లాక్కెళ్లారు. ఈ ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు లేఖ రాశారు. వైసీపీకి చెందిన 30 మంది వెంకటేష్ ని కొట్టారని ఆరోపిస్తూ దాడికి సంబంధించిన ఫోటోలను లేఖకు జత చేసి పంపించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ముప్పు పొంచి ఉన్న అభ్యర్థులకు భద్రత కల్పించాలన్నారు.
తక్షణమే కుప్పం ఎన్నికల్లో దాడి చేసిన వారిని చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కుప్పం మున్సిపాలిటీ పై ఎగిరేది తమ జెండానే అని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. కుప్పం లో ఉన్న 25 వార్డులకు 125 పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపాలిటీ ఎన్నికల బాధ్యతలను టిడిపి తరపున పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చూస్తున్నారు. వైసీపీ తరఫున ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యే వెంకట గౌడ పర్యవేక్షిస్తున్నారు. టిడిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా త్రిలోక్ బరిలోకి దిగనుండగా, వైసీపీ తరఫున డా.సురేష్ ఉన్నారు.