రాజుగారు రాజీనామా చేసేయండి...ఆ ఐదుగురు కూడా!

M N Amaleswara rao
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ సత్తా చాటిన విషయం తెలిసిందే. అయితే హుజూరాబాద్ తెలంగాణకు సంబంధించినదే అయినా...ఏపీ ప్రజలు కూడా ఆ ఫలితంపై ఎంతో ఆసక్తి కనబర్చారు. అక్కడ కేసీఆర్ వర్సెస్ ఈటలగా జరిగిన వార్‌లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠకు గురయ్యారు. పైగా ఏపీ నుంచి బెట్టింగులు కూడా ఎక్కువ జరిగాయి.

అయితే ఇలా అందరినీ ఉత్కంఠకు గురిచేసిన హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌పై ఈటల రాజేందర్ మంచి మెజారిటీతో గెలిచారు. ఇక ఈటల విజయం ప్రభావం తెలంగాణ రాష్ట్రంపైనే కాదు...ఏపీ పైన కూడా పడింది. అధికార పార్టీ నుంచి వచ్చి ప్రతిపక్షంలోకి వెళ్ళి పోటీ చేసి గెలవడమనేది మామూలు విషయం కాదనే చెప్పాలి. కానీ అధికార పార్టీలు అహంకారంతో ఉంటే ఫలితం ఇలాగే వస్తుందని ఈటల చూపించారు.


అదే సమయంలో పార్టీలు మారే నాయకులు తమ పదవులకు రాజీనామా చేస్తేనే ఫలితం ఉంటుందని రుజువు చేశారు. కేసీఆర్ మంత్రివర్గం నుంచి తప్పించిన వెంటనే ఈటల..టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చేశారు..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ తెలంగాణలో చాలామంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయకుండా టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. ఇటు ఏపీలో టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక జనసేన ఎమ్మెల్యే వైసీపీ వైపుకు వెళ్లారు. అనధికారికంగా వైసీపీలో చేరకపోయినా సరే, వారు వైసీపీ ఎమ్మెల్యేలుగానే నడుచుకుంటున్నారు. ఇటు వైసీపీ తరుపున గెలిచిన ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం..అదే వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

అయితే ఈటలని చూసి రఘురామ నేర్చుకోవాలని దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలవాలని వైసీపీ శ్రేణులు సవాల్ విసురుతున్నాయి. ఇక వైసీపీ వైపుకు వచ్చిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలవాలని టీడీపీ శ్రేణులు కూడా వైసీపీకి సవాల్ విసురుతున్నాయి. అయితే ఏపీలో సవాళ్లే తప్ప, పదవులకు రాజీనామా చేసే ధైర్యం ఏ నాయకుడుకు లేదనే చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: