ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. వారికి ప్రాణభయం..

Deekshitha Reddy
కరోనా ఆంక్షలు ఎక్కడా కనిపించడంలేదు, అసలు జనాల్లో కరోనా భయమే లేదు. మాస్క్ లు పెట్టుకోవడం దాదాపుగా అందరూ మానేశారు. కరోనా అంటే అసలేంటో తెలియదన్నట్టే ప్రవర్తిస్తున్నారు. దీంతో కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారికి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ హాస్టల్ లో 16మంది మెడికల్ స్టూడెంట్స్ కి ఒకేసారి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. కాలేజీ ప్రిన్సిపల్ ఈ విషయాన్ని ధృవీకరించారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థులందర్నీ హాస్టల్ లోని ఓ రూమ్ లో ఐసోలేషన్ లో ఉంచారు. వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

ఢిల్లీ వెళ్లి రావడమే కారణమా..?
ఇటీవల మెడికల్ కాలేజీ స్టూడెంట్ ఒకరు ఢిల్లీలో ఓ ఫంక్షన్ కి వెళ్లి వచ్చారు. అతనికి స్వల్ప అస్వస్థత ఉన్నా కూడా స్నేహితులంతా కలిసే ఉన్నారు. దీంతో వారికి కూడా వైరస్ సోకినట్టు తేలింది. మొత్తం 16మందికి పాజిటివ్ అని తేలడంతో కాలేజీ స్టూడెంట్స్ ఆదుర్దా పడుతున్నారు. మిగతా వారిలో జలుబు లక్షణాలు ఉన్నవారు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు సిబ్బంది. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు మెరుగైన వైద్య సౌకర్యం అందిస్తున్నారు.

థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో ఏపీలో అక్కడక్కడా కరోనా కేసులు బయటపడటంతో ఆందోళన మొదలవుతోంది. అయితే ఇతర ప్రాంతాలనుంచి వచ్చేవారితో జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి అనారోగ్య లక్షణాలున్నా వెంటనే ఆస్పత్రులకు రావాలని, తగిన చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. మరోవైపు వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. గతంలో కూడా వృద్ధులకు అధిక ప్రాణభయం ఉంది. అయితే ఇప్పుడు వృద్ధుల్లో దాదాపు అందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో ఆ భయం కాస్త తగ్గిందనే చెప్పాలి. కానీ వ్యాక్సినేషన్ చేయించుకున్నా కొవిడ్ వదిలిపెట్టడంలేదనే ప్రచారం కూడా ఉంది. దీంతో వృద్ధులు ఈ సారి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: