రేవంత్‌కు నాకు విభేదాలు లేవు భ‌ట్టి

N ANJANEYULU
తెలంగాణ‌లో హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఉపఎన్నిక రోజు రోజుకు వేడెక్కుతున్న‌ది. తాజాగా కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డికి, భ‌ట్టి విక్ర‌మార్క‌కు విభేదాలు ఉన్నాయ‌ని పుకార్లు వినిపించాయి. వాటిని భ‌ట్టి విక్ర‌మార్క‌, రేవంత్‌రెడ్డి తిప్పికొట్టారు. మంగ‌ళ‌వారం భ‌ట్టి మీడియాతో మాట్లాడారు. త‌న‌కు రేవంత్‌కు ఎలాంటి విభేదాలు లేవ‌ని.. కొంద‌రూ కావాల‌నే విభేదాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం చేస్తున్న‌ట్టు తెలిపారు. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ అభ్య‌ర్థి వెంక‌ట్ బ‌ల‌హీనుడ‌ని ప్ర‌చారం చేస్తున్నార‌ని.. అత‌ను బ‌ల‌మైన నేత అని వెల్ల‌డించారు. రాష్ట్రం తెచ్చుకున్న‌దే ఉద్యోగాల కోసమ‌ని.. ఇప్పుడు ఆ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌క‌పోవ‌డం ద్వారా రాష్ట్రం వ‌చ్చి ఏమి లాభం అని పేర్కొన్నారు.
 బీజేపీ, టీఆర్ఎస్  రెండు ఒక్క‌టే అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో ఎవ‌రికీ విభేదాలు లేవు. అంద‌రి ల‌క్ష్యం ఒక్క‌టే.. ఒక్కొక్క‌రూ ఒక విధానంతో పార్టీ భావ‌జాలంతో అధికారంలోకి తీసుకురావ‌డానికి ముందుకెళ్తున్నారు. ద‌ళిత బంధును బీజేపీ, టీఆర్ఎస్ క‌లిపి ఆపార‌ని చెప్పారు.  బీజేపీకి మొద‌టి నుంచి పేద‌లు అంటే అంత‌గా ఇష్టం ఉండ‌దు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో రైతుబంధును ప్ర‌త్యేకంగా లేఖ రాసి ఇప్పించారు. ఇప్పుడు కూడ ప్ర‌భుత్వం ఆ విధంగా చేస్తే ద‌ళిత‌బంధు ఆగిపోతుందా అని ప్ర‌శ్నించారు. ఇవ్వాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయ‌ని వివ‌రించారు. ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించేందుకు టీఆర్ఎస్ ముంద‌స్తు గురించి మాట్లాడుతుంద‌ని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగం, న‌దిజ‌లాల వంటి అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని వాట‌న్నింటిని ప‌రిష్క‌రించ‌కుండా ప్ర‌జ‌ల‌ను దృష్టి మ‌ళ్లిస్తోంద‌ని వెల్ల‌డించారు.
హూజూరాబాద్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల‌కు బుద్ధి చెప్పిన‌ట్టు అవుతుంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న‌ద‌ని.. ప్ర‌జ‌ల‌కు ఇవ్వాల్సిన‌వి ఇవ్వ‌డం లేద‌ని..  ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి ఓట్లు దండుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని పేర్కొన్నారు.  ద‌ళిత బంధును రాష్ట్రవ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. ఆ కాంగ్రెస్ పార్టీని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు అధికారంలోకి తీసుకొస్తార‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: