శత్రువుకు శత్రువు మిత్రుడు. ఈమధ్య టిడిపి దీన్ని బాగా ఫాలో అవుతోంది. ఒకప్పటి ఆప్త మిత్రుడు పవన్ కు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తుంది. ఆయనను వైసిపి విమర్శిస్తే టిడిపి కస్సుమని ఒంటికాలిపై లేస్తుంది. అది పార్టీలోని ఒక వర్గ నేతలకు అసలు నచ్చడం లేదట. మనల్ని పట్టించుకోని అతనికి ఏంటి అంత ప్రయారిటీ ఒకటే గుసగుసలు. ఇటీవల ఏపీ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే పొత్తులు, సమీకరణలు మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మిత్రులుగా ఉన్న బిజెపి, జనసేన మధ్య బంధం బీటలు వారి టిడిపి జనసేన మధ్య కొత్త పొత్తులు చిగురించే సూచనలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
దీనికి తగ్గట్టుగానే పరిణామాలు ఉంటున్నాయి. టిడిపి విషయంలో సాఫ్ట్ గా మాట్లాడడం ప్రధానంగా కమ్మ, సామాజిక వర్గాన్ని వెనకేసుకు రావడం వంటివి పవన్ కళ్యాణ్ వైపునుంచి జరిగితే ఇటీవల వైసిపి వర్సెస్ జనసేన ఎపిసోడ్ లో టిడిపి పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచింది. ఇదే సమయంలో టీడీపీలో మరో చర్చ జరుగుతోంది. జనసేనకు ఈ స్థాయిలో ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అని చాలామంది నేతలు అంతర్గత సమావేశాలు, భేటీలలో ప్రశ్నిస్తున్నారట. గత రెండున్నర ఏళ్ళ కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిడిపి పోరాటాలు చేసింది. ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విషయంలో మంత్రి పేర్ని నాని ఏ విధంగా అయితే టార్గెట్ చేసి దుమ్ము దులిపేసారో, చంద్రబాబు, లోకేష్ లను కూడా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంటివారు అదేవిధంగా టార్గెట్ చేశారు. పొలిటికల్ ఫ్లాట ఫామ్ దాటివెళ్లాయి ఆ విమర్శలు. అలాగే వివిధ సందర్భాల్లో టిడిపి చేసే కార్యక్రమాలను అధికార పార్టీ అడ్డుకోవడం బాధితులను పరామర్శించడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం చంద్రబాబు,లోకేష్ లను అడ్డుకొని పోలీస్ స్టేషన్లకు తరలించడం వంటి సంఘటనలు చాలా జరిగాయని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఏ ఒక్క రోజైనా పవన్ కళ్యాణ్ గాని ఆ పార్టీలోని చెప్పుకోదగ్గ లీడర్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ గాని స్పందించారా మనకు మద్దతు ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నారట.
ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ విషయంలో అంత లా స్పందించాల్సిన అవసరం ఏముందని అంటున్నారట. పైగా పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన ప్రసంగాలలో లోతుగా విశ్లేషిస్తే జగన్ ను,ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నట్టు కనిపించినా తెలుగుదేశానికి అండగా ఉండే వివిధ సామాజిక వర్గాలను, సంప్రదాయ ఓట్లను లక్ష్యం చేసుకున్నట్లుగా ఉందని చెబుతున్నారు. జనసేన తో పొత్తు పెట్టుకుంటే లాభం అని లెక్కలు వేసుకునే బదులు నష్టం జరుగుతుందా అనే కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారట.