ఫైర్ విల్ బి ఫైర్ : వెయ్యి కోట్లు ఇవ్వండి సర్ !
నిధులన్నీ నీళ్లకే వెచ్చిస్తే రాష్ట్రం ఏమౌతుంది సర్.. ఏమౌతుంది ఏం కాదు నేనున్నా.. కేంద్రంతో పోరాడి నిధులు తెస్తాను..మీరు ఆందోళన చెందకండి..అని భరోసా ఇచ్చిన గొప్ప నేత అని కొనియాడారు ఆ వేళ. పొగడ్త కాదు వాస్తవం ఇదే! రాజశేఖర్ రెడ్డి కారణంగా వంశధార ప్రాజెక్టు కానీ తోటపల్లి ఆధునికీకరణ కానీ, జంఝావతి రబ్బరు డ్యాం నిర్మాణం కానీ పోలవరం పనులు వేగవంతం కావడం కానీ ఇలా చాలా జరిగాయి. ఆయన ఉద్దేశం ఇచ్ఛాపురం వరకూ పోలవరం కాలువ నీళ్లు ఇవ్వాలని.
కానీ జగన్ మాత్రం అస్సలు ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు. రాజశేఖర్ రెడ్డి హయాంలో మడ్డువలస కానీ లేదా ఇతర ప్రాజెక్టుల రూపకల్పన శ్రీకాకుళం కేంద్రంగా జరిగింది. నారాయణపురం ఆధునికీకరణకు ఆయన మొగ్గు చూపారు. మా జిల్లా శ్రీకాకుళంకు ఎప్పుడు వచ్చినా రైతుల పరిస్థితి అడిగి తెలుసుకునే వారు. ఇదంతా జగన్ చేయడం లేదు. ఇకపై చేయలేరు కూడా! నాలుగు కోట్ల రూపాయల నిధులు ఇస్తే రేగిడి మండలం (రాజాం నియోజకవర్గ పరిధి), సాయన్న కాలువ ఆధునికీరణ సాధ్యం. పనులు వేగం గా పూర్తయితే పది వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి. అదేవిధంగా తోటపల్లి పిల్ల కాలువల తవ్వకానికి ఎప్పటి నుంచో అధికారులు నిధులు అడుగుతూ అడుగుతూ వస్తుంటే పిల్ల కాలువల తవ్వకానికి, నిర్వహణకు ఎట్టకేలకు 120 కోట్ల రూపాయలు మంజూరుచేశారు జగన్.
ఇదొక్కటి తప్ప జిల్లాకు ఆయన చేసిందేం లేదు. పోనీ ఎత్తిపోతల పథకాలకు నాబార్డు నిధులు ఇస్తుంది కదా! అలా అయినా ఏమయినా పనులు చేపట్టారా అంటే అదీ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతులు చేపట్టేందుకు వెయ్యి కోట్ల రూపాయలు అవసరం. వంశధార రెండోదశ పనులకు సంబంధించి బకాయి వంద కోట్లు పోనీ వీటినైనా తీర్చగలరా? అన్నది సంశయం. సందిగ్ధం.