గులాబీ ఇలాకాలో కాంగ్రెస్.. సక్సెస్ అవుతారా..?

MOHAN BABU
గులాబీ కోట లో కాంగ్రెస్ జెండా ఎగరనుంది. సీఎం సొంత జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ రెడ్డి నేడు టిపిసిసి ప్రెసిడెంట్ హోదాలో తొలిసారి గజ్వేల్లో అడుగుపెట్టనున్నారు. దళిత,గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు పోలీసుల నుంచి అనుమతి లభించింది. గజ్వేల్ ఐఓసి గ్రౌండ్లో సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.నేటి సభకు ముఖ్య అతిథులుగా రేవంత్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతుండగా,ఈ సభ విజయవంతానికి భారీ జన సమీకరణ పై నాయకులు దృష్టిసారించారు. ఇప్పటికే గ్రామగ్రామాన సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. నేడు గజ్వేల్ లో నిర్వహించే దళిత,గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కొత్తగా పిసిసి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి సీఎం ఇలాకాలో తొలిసారి పాల్గొనే బహిరంగ సభ కావడంతో కాంగ్రెస్ నాయకులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.

 గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తో పాటు, మరికొందరు ప్రముఖులు హాజరు కానున్నందున రెండు ప్రత్యేక స్టేజి లను ఏర్పాటు చేశారు. గజ్వేల్ సభకు జనం భారీగా హాజరయ్యే అవకాశం ఉన్నందున పార్కింగ్ సమస్య లేకుండా పార్కింగ్ ఏర్పాటు చేశారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి గీతారెడ్డి,మాజీ ఎంపీ రాజయ్య, పిసిసి నాయకులు నరేందర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డిలు దగ్గరుండి పర్యవేక్షించారు. సభ ఏర్పాట్లపై ప్రత్యేక సూచనలు చేశారు.

నేడు రేవంత్ రెడ్డి గజ్వేల్ సభకు హాజరు అవుతున్న దృష్ట్యా, కాంగ్రెస్ నాయకులు రాజీవ్ రహదారి పొడవునా ఫ్లెక్సీలు,హోర్డింగ్ తో నింపేశారు. సిద్దిపేట జిల్లా సరిహద్దు వంటిమామిడి నుండి గజ్వేల్- ప్రజ్ఞాపూర్,గజ్వేల్ సభ వరకు రహదారిని మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి . సీఎం ను తరచూ విమర్శించే రేవంత్ రెడ్డి, గజ్వేల్ వేదికగా ఏ స్థాయిలో సీఎం పై విరుచుకు పడతాడోఅని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పైగా నేడు తెలంగాణ విమోచన దినం. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పిన సీఎం కేసీఆరే, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నోరుఎత్తడం లేదు. అలాంటి రోజున సీఎం ఇలాక కు వస్తున్న రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. నేటి రేవంత్ ప్రసంగం కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపినుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: