తెలంగాణ నిరుద్యోగ లెక్కతేలిందా.. త్వరలో..?

MOHAN BABU
నీళ్లు నిధులు నియామకాల పేరుతో  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఈ తెలంగాణ  రాష్ట్రం ఏర్పాటు కోసం  ఎంతోమంది యువకులు ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రెండోసారి టిఆర్ఎస్ గద్దెకెక్కింది. కానీ అనుకున్నంత స్థాయిలో  నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని చెప్పవచ్చు. దీంతో తెలంగాణలోని నిరుద్యోగ యువత తెరాస పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. కెసిఆర్  ఇప్పటికైనా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారా..? తెలంగాణ నిరుద్యోగుల పై ప్రభుత్వం ఏ విధమైన కసరత్తు చేస్తోంది..?  తెలంగాణ రాష్ట్ర ఖాళీ లెక్కలను రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్ధారించింది. ఇకనైనా ప్రభుత్వం నోటిఫికేషన్ల గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా.. నిరుద్యోగులకు తీపి కబురు చెబుతుందా అని చర్చ జరుగుతోంది.


రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ శాఖల్లో దాదాపు 67 వేల ఎనిమిది వందల ఉద్యోగ ఖాళీలను రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్ధారించింది. తుది నివేదికను సిద్ధం చేసిన ఆర్థిక శాఖ దాన్ని రేపోమాపో కెసిఆర్ వద్దకు పంపించనుంది. నిజానికి గత నెలలోనే ఉద్యోగ ఖాళీల వివరాలను నివేదిక  కేబినెట్ ముందుకు వచ్చింది.  ఈ నివేదికపై కేసీఆర్ కేబినెట్ సమావేశంలో కూడా చర్చించారు. కానీ ఆ నివేదిక అసమగ్రంగా ఉందని దాన్ని తిరస్కరించారు. మరోసారి కసరత్తు చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయా శాఖల్లోని ఖాళీ లెక్కలు తీసిన అధికారులు మరోసారి కేబినెట్ కు త్వరలో పంపించే అవకాశం ఉంది. దీనిపై క్యాబినెట్ లో ఆమోద ముద్ర పడితే నోటిఫికేషన్లు విడుదలవుతాయి. అయితే క్యాబినెట్ ఇప్పటికైనా నోటిఫికేషన్ లపై గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, లేదా అన్న దానిపై సందేహం నిరుద్యోగుల్లో తలెత్తుతోంది.


హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందే నోటిఫికేషన్ ఇస్తారా.. లేదా ఎలక్షన్ అయిపోయాక ఇస్తారా అనేది చర్చ సాగుతోంది. కానీ ప్రభుత్వం ఇప్పటికే లక్ష ఉద్యోగాలు ఇచ్చామని చెబుతోంది. ఇంకా 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని  తెలుపుతోంది. కానీ ఇప్పటికి కూడా నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంతో చాలా మంది నిరుద్యోగుల ఏజ్ బార్ అవుతుంది. కనీసం వారికి ఏజ్ బారు నుంచి సడలింపు ఇచ్చే  చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టడం లేదు. దీంతో ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: