తాలిబన్ల అరాచకత్వం వల్ల అఫ్గానిస్తాన్ ప్రజలు ప్రాణభయంతో బెంబేలెత్తిపోతున్నారు. కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద కనిపిస్తున్న దృశ్యాలు సైనికులను సైతం కలచి వేస్తున్నాయి. ఆడవారి హృదయవిదారక స్థితిని చూసి అమెరికన్ జవాన్లు కంటతడి పెట్టుకుంటున్నారు. రోజురోజుకీ అక్కడి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. దీంతో మిత్ర దేశమైన భారత్ అఫ్గాన్ పౌరులను స్వదేశంలోని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కృషి చేస్తోంది. తాజాగా కాబూల్ విమానాశ్రయం నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో 168 మందిని ఘజియాబాద్‌కు తరలించింది. ఈ 168 మంది వ్యక్తులలో 107 మంది ఇండియన్స్ కాగా.. మిగిలిన వారు అఫ్గాన్ పౌరులు. వీరిలో ఇద్దరు అఫ్గాన్ ఎంపీలు కూడా ఉన్నారు.
ఆదివారం రోజు తాలిబన్ల రాజ్యం నుంచి హిండాల్ వైమానిక స్థావరానికి సురక్షితంగా చేరుకున్న వీరందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే భారత
రాజధాని ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడిన అఫ్గాన్ ఎంపీలు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 20 ఏళ్లుగా తాము కష్టపడి ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న ప్రతిదీ సర్వనాశనం అయింది అంటూ
ఎంపీ నరేందర్ సింగ్ ఖల్సా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పాత్రికేయులతో మాట్లాడుతున్నంత సేపూ ఆయన తన ఏడుపును కంట్రోల్ చేసుకోలేక పోయారు. తమ దేశ పరిస్థితి గురించి మాట్లాడుతూ వెక్కివెక్కి ఏడ్చారు. తమ దేశ ప్రజలకు శూన్యం తప్ప ఇంకేమీ మిగల్లేదు అని కన్నీరు కార్చారు.
మాతృభూమి అఫ్గానిస్తాన్ ని వదిలి వచ్చినందుకు చాలా బాధగా ఉందని కానీ
ఇండియా తమకు మరో మాతృదేశం లాంటిదని చెబుతూ నరేందర్ సింగ్ ఎమోషనల్ అయ్యారు. తాలిబన్లు ఎంపీల ఇళ్లలోకి ఇష్టానుసారం ప్రవేశిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారని తెలిపారు. తాలిబన్ల క్రూరమైన చేష్టలకు భయపడిపోయిన తాను తన కుమార్తె, మనవరాళ్లతో కలిసి ఇండియాకి వచ్చానని చెప్పుకొచ్చారు. తనతో పాటు తన కుటుంబాన్ని కాపాడినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.