కోవిడ్ ప్రభావితమైన మెదడు ఇలా ఉంటుందా?
మార్చి 2020లో న్యూయార్క్ కి చెందిన 32 ఏళ్ల ఫ్రీలాన్స్ డేటా శాస్త్రవేత్త హన్నా డేవిస్ కోవిడ్-19 బారిన పడ్డారు. అయితే ఆమెలో కనిపించిన ఆమె మొదటి లక్షణం పొడిదగ్గో లేదా జ్వరమో కాదు. ఆమెలో కనిపించిన తొలి లక్షణం ఫ్రెండ్ పంపించిన టెక్స్ట్ మెసేజ్ చదవలేకపోవడం. మొదట్లో అలసటగా ఉన్నానని అందుకే మెసేజ్ చదవలేకపోయానని భావించిన ఆమె ఆ తరువాత కరోనా వల్ల ఇలా జరుగుతుందని తెలుసుకున్నారు. రోజువారి పనులు చేసుకోవడానికి కూడా ఆమె చాలా ఇబ్బంది పడ్డారు.
ప్రస్తుతం ఆమె షార్ట్ టర్మ్ మెమరీ లాస్ తో రోజులో కొద్ది గంటల కంటే ఎక్కువ సేపు పని చేయలేక పోతున్నారు. అయితే ఇలాంటి లక్షణాలు శాశ్వతంగా ఉంటాయా లేక కొంత సమయం తర్వాత తగ్గిపోతాయా అనే కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో 50% మంది కరోనా రోగులు మానసిక సమస్యలను ఎదుర్కొన్నారని తేలింది. మెదడు వాపు, మెదడులోని రక్త కణాలు గడ్డ కట్టడం వంటి అనారోగ్య సమస్యలను ఎంఆర్ఐ స్కాన్ ద్వారా పరిశోధకులు తెలుసుకున్నారు.