దేశవ్యాప్తంగా హై అలర్ట్.. విశిష్ట సేవలకు సత్కారం..!
ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. ఏటా ప్రదానం చేసే పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇందులో ఏపీ నుంచి 11మంది.. తెలంగాణ నుంచి 14మంది పోలీసులు గ్యాలంట్రీ పతకాలకు ఎంపికయ్యారు. ఇక మొత్తంగా.. వివిధ రాష్ట్రాలకు చెందిన 1,380మంది పోలీసులు పతకాలకు ఎంపికయ్యారు. ఇద్దరు రాష్ట్రపతి పోలీస్ పతకాలుండగా.. 628గ్యాలంట్రీ పతకాలకు ఎంపికయ్యారు.
మరోవైపు ఆగస్ట్ 14వ తేదీ అనగా ఈ రోజు విభజన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేయగా.. విభజన వేళ సమరయోధుల ప్రాణాలర్పించారని కేంద్రం తెలిపింది. సమరయోధుల త్యాగాలును స్మరించుకోవాలన్న కేంద్రం.. భావితరాలు గుర్తు చేసేందుకు స్మృతి దినోత్సవం నిర్వహిస్తున్నామంది. అయితే ఈ ఉదయమే దీనికి సంబంధించి ప్రధాని మోడీ ప్రకటన చేయగా..సాయంత్రానికి హోంశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది.
దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది పోరాటాలు.. త్యాగాలు చేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశ విభజన సందర్భంగా తలెత్తిన హింసతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి త్యాగాలను స్మరించుకునేందుకు గానూ.. ఆగస్ట్ 14వ తేదీని విభజన సంస్మరణ దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. రేపటి స్వాతంత్ర్య దినోత్సవానికి యావత్ భారత దేశం సిద్ధమవుతోంది. గుండెపై జాతీయ జెండాను ఉంచి.. ఉప్పొంగే ఆనందంతో సెల్యూట్ చేసేందుకు సిద్ధమైపోతోంది. త్యాగధనులను గుర్తు చేసుకుంటూ వారి స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాలని ఆరాటపడుతోంది.