వంశీ విషయంలో తమ్ముళ్ళ బాధ ఏంటి?

M N Amaleswara rao
తెలుగుదేశం పార్టీ తరుపున రెండోసారి గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, వైసీపీ వైపుకు వెళ్ళిన వల్లభనేని వంశీని టీడీపీ కార్యకర్తలు నిత్యం టార్గెట్ చేస్తూనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన్ని మళ్ళీ టీడీపీలోకి రానిచ్చే పరిస్తితి లేదని తమ్ముళ్ళు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. అసలు వంశీని టీడీపీలోకి రానివ్వకపోవడం ఏంటి? ఆయన మళ్ళీ టీడీపీలోకి వస్తున్నారని ఎవరు చెప్పారు? అసలు తెలుగు తమ్ముళ్ళ బాధ ఏంటో ఒక్కసారి చూద్దాం.

వరుసగా గన్నవరం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ, అనూహ్య పరిణామాల మధ్య వైసీపీ వైపుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా, డైరక్ట్‌గా వైసీపీ కండువా కప్పుకోకుండా వంశీ, టీడీపీని వీడి జగన్ ప్రభుత్వానికి మద్ధతు ఇచ్చారు. ఇక ప్రభుత్వానికి మద్ధతు ఇచ్చాక గన్నవరంలో వంశీకి బాగానే పనిచేసుకుంటున్నారు. అటు తన స్నేహితుడు, మంత్రి కొడాలి నాని సపోర్ట్ వంశీకి బాగానే ఉంది.

అయితే వంశీ వైసీపీ వెళ్ళాక నియోజకవర్గంలో కాస్త ఆధిపత్య పోరు పెరిగింది. వైసీపీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులు వంశీ వైసీపీలోకి రావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా సార్లు బహిరంగంగానే వంశీపై విమర్శలు చేశారు. అయితే ఆ ఇద్దరు నేతలనీ వైసీపీ అధిష్టానం బుజ్జగించే కార్యక్రమం కూడా చేసింది. దీంతో ఈ మధ్య ఆ ఇద్దరు సైలెంట్ అయినట్లు కనిపిస్తోంది.

మరి సడన్‌గా ఏమైందో తెలియదు గానీ వైసీపీలో వంశీకి టికెట్ రాకపోతే, ఆయన టీడీపీలోకి రావాలని చూస్తే మాత్రం తాము రానివ్వమని తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు, నారా లోకేష్‌లని తీవ్రంగా విమర్శించిన వంశీని టీడీపీలోకి తీసుకునే ప్రసక్తి లేదని అంటున్నారు. అసలు వంశీ మళ్ళీ టీడీపీలోకి వస్తారని వీళ్ళకు ఎవరు చెప్పారంటూ, ఆయన అనుచరులు మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వంశీ, వైసీపీ నుంచి పోటీ చేసి గన్నవరంలో హ్యాట్రిక్ కొట్టబోతున్నారని మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి పరిస్తితుల్లో తమ్ముళ్ళ ప్రచారం ఏంటో అర్ధం కాకుండా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: