ప్లాస్టిక్ లేకుండా మానవుడి నిత్య జీవనం గడిచేదే కష్టమైపోయింది. సరుకులు కొన్నా, తినుబండారాలు తీసుకున్నా, వస్తువులు కొన్నా, పాలు, పండ్లు, పూలు ఇలా అన్ని ప్లాస్టిక్ కవరల్లోనే నింపేసి ఇచ్చేస్తున్నారు. చివరికి చాలా దేవాలయాల్లో ప్రసాదాలు ఇవ్వడానికి కూడా ప్లాస్టిక్ కవర్లనే వాడుతున్నారు. ఈ ప్లాస్టిక్ వలన మన ఆరోగ్యం నెమ్మది నెమ్మదిగా నాశనమవుతోంది. వాడిన తర్వాత ఈ ప్లాస్టిక్ ని మనుషులు రోడ్డుపై, జలాశయాల్లో గుట్టలు గుట్టలుగా విసిరి పారేస్తున్నారు. రోడ్లపై , చెత్త కుండీల వద్ద కనిపించిన ఆకులు అలములు, తిను పదార్ధాలను తినడానికి వచ్చిన జంతువులు వాటి నుండి ప్లాస్టిక్ ను వేరు చేయలేక ఆ ప్లాస్టిక్ తో పాటే తినేస్తున్నాయి.
అయితే ఇలా తిన్న తరువాత అవి కడుపులో ఉండిపోయి జీర్ణం కావు. మరియు ప్లాస్టిక్ ఉన్నప్పుడు ఆకలి ఎక్కువగా వేయదు. తద్వారా తక్కువగా ఆహారాన్ని భుజించి అవి జీర్ణంకాక తీవ్ర వ్యాధుల భారిన పడి తరచూ జబ్బుల పడడం, బలహీనం అయిపోవడం, కొన్ని సార్లు మరణించడం వంటివి జరుగుతున్నాయి. గృహాల నుండి, ఫ్యాక్టరీల నుండి, పరిశ్రమల నుండి వెలువడే ప్లాస్టిక్ వ్యర్ధాలను కాలువలు, నదులు, చెరువులు, సముద్రాల్లో పడేస్తున్నారు. ఇవి అన్నీ నీటిలో కలుషితం అయిపోయి అందులో జీవించే జలచరాలు ఆ ప్లాస్టిక్ వ్యర్దాలు నిండిన తాగి జబ్బుల బారిన పడుతున్నాయి. రంగు రంగుల ప్లాస్టిక్ కవర్లు తయారుచేయడానికి వినియోగించే రసాయనాలు నీటిలో చేరి నీరు కలుషితం అయిపోతుంది.
ఆ కలుషితం అయిన నీటిని త్రాగి కొన్ని సార్లు ఇవి మరణిస్తున్నాయి. తాబేళ్లు, కొన్ని పెద్ద చేపలు చేరి ఉన్న ప్లాస్టిక్ ను జెల్లీ ఫిష్ లుగా, చేపల గుడ్లు భావించి కొరికి తింటాయి. ఇలా ప్లాస్టిక్ వలన జంతువులు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవడం లేదా మరణించడం వంటివి జరుగుతున్నాయి. ప్లాస్టిక్ వల్ల ఇలా మూగ జీవాలు అకారణంగా బలై పోతున్నాయి. ప్లాస్టిక్ ని కనుగొన్న మానవుడు అదే ప్లాస్టిక్ కారణంగా తాను సమస్యల్లో పడటమే కాకుండా పాపం పుణ్యం తెలియని మూగ జంతువుల ప్రాణాలకు కూడా పరోక్షంగా హాని కలిగిస్తున్నాడు. ఇకనైనా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదిద్దాం మనతో పాటు నోరు లేని మూగజీవుల ప్రాణాలను కాపాడుకుందాము. ఇది ఒక్కరితో జరిగేది కాదు. అందరం బాధ్యతగా తీసుకుని అడుగు ముందుకేయాలి.