జగన్‌తోనే పోటీకి స‌వాల్ విసురుతోన్న సినీ హీరో ?

VUYYURU SUBHASH
వైఎస్ జగన్ని ఏపీలోని విపక్షాలు ఏమీ చేయలేకపోతున్నాయి. ఈ సంగతి ఎవరు ఒప్పుకోకపోయినా నిజం. జగన్ అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన వద్ద సంక్షేమ ఆయుధం ఉన్నంతవరకూ ఎవరూ ఏమీ చేయలేరు. ఇది పచ్చి నిజం. అయితే జగన్ కొన్ని హామీల విషయంలో గత రెండున్నరేళ్ళుగా ఏమీ చేయలేదు అన్న విమర్శలు ఉన్నాయి. అవి మేధావులు, విద్యావంతులు, మధ్యతరగతి వర్గాలలోనే ఎక్కువగా  ఉంది. అందులో అతి ముఖ్యమైనది ప్రత్యేక హోదా. ఈ అంశం మీద జగన్ ఏమీ చేసేది లేదని ఒక దశలో చేతులెత్తేశారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉందని, అందువల్ల తాము ఏమీ చేయలేమని ఆయన చెప్పేసుకున్నారు.

సరిగ్గా ఈ పాయింట్ నే పట్టుకుని సినీ నటుడు శివాజీ ఇపుడు రంగంలోకి దూకబోతున్నారు. ప్రత్యేక హోదా ఏపీకి సంజీవని అని జగన్ చెప్పారని, ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆయన ఇదే హామీ ఇస్తూ జనంలో తిరిగారని కూడా శివాజీ గుర్తు చేస్తున్నారు. ఏపీ బాగుపడాలి అంటే ప్రత్యేక హోదాను మించినది ఏదీ లేదని కూడా ఆయన అంటున్నారు. ఈ విషయంలో వైసీపీ ఏమీ చేయకపోయినా తాము మాత్రం జనాలను కదిలిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అటు రాష్ట్రాన్ని, మరో వైపు కేంద్రాన్ని కూడా నిలదీసి హోదా సాధించేందుకు కృషి చేస్తామంటున్నారు.

దీని కోసం ఆయన మంచి ముహూర్తాన్ని కూడా ఎంచుకున్నారు. విజయదశమి తరువాత తన కార్యాచరణను ప్రారంభిస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు. జగన్ సర్కార్ హోదా సాధనలో విఫలం అయినందువల్ల తామే జనాలను కలుపుకుని మరీ ఆందోళన చేస్తామని ఆయన అంటున్నారు. ఇది అంతం కాదు ఆరంభమని కూడా ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయంలో శివాజీ గరుడ పురాణం అంటూ హడావుడి చేసిన సంగతి విధితమే.

అంతే కాదు, చంద్రబాబుకు మద్దతుగా ఆయన టీడీపీ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన కనిపించలేదు. కానీ ఇపుడు రెండున్నరేళ్ల పాలన పూర్తి కావడంతో వైసీపీకి ఇరుకున పెట్టే అస్త్రంతోనే మళ్ళీ జనాల్లోకి వస్తున్నారు. చూడాలి మరి శివాజీ ఈసారి సక్సెస్ అవుతారా లేదా అన్నది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: