అయ్యన్న ఫ్యామిలీ వార్: కుమారుడు వర్సెస్ సోదరుడు?

M N Amaleswara rao
చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనేమీ లేదు. ఏపీ రాజకీయాల్లో సుపరిచితమైన పేరు. దశాబ్దాలపాటు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నాయకుడు. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన అయ్యన్న... టిడిపి స్థాపించిన దగ్గర్నుంచి ఆ పార్టీలో పనిచేస్తూ వస్తున్నారు. విశాఖపట్నంలో టిడిపికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

అలాగే నర్సీపట్నం నియోజకవర్గానికి పలుమార్లు ప్రాతినిధ్యం వహించారు. 2014లో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో అయ్యన్నకు ఓటమి తప్పలేదు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు, వైసీపీ నాయకుడు ఉమాశంకర్ గణేష్ చేతిలో అయ్యన్న ఓటమి పాలయ్యారు. అయితే జగన్ గాలిలో చాలా మంది సీనియర్లు ఓడిపోయారు. ఇక అలా ఓడిపోయినవారంతా ఇంటికే పరిమితమయ్యారు. బయటకు వచ్చి మళ్లీ పార్టీ తరఫున పోరాడే నాయకులు కరువైపోయారు.

కానీ అయ్యన్న ఓడిపోయినా సరే పార్టీ కోసం చాలా కష్టపడుతున్నారు. వైసీపీపై గట్టిగా పోరాడుతున్నారు. అటు అయ్యన్న కుమారుడు విజయ్ కూడా పార్టీ కోసం కష్టపడుతున్నారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేయడానికి విజయ్ ఆసక్తిగా కూడా ఉన్నారు. గత ఎన్నికల్లోనే కుమారుడు టికెట్ కోసం అయ్యన్న ప్రయత్నించారు కానీ చంద్రబాబు ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అని చెప్పడంతో అయ్యన్న ఒక్కరే పోటీలోకి దిగారు. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం తనతో పాటు తన కుమారుడికి టికెట్ తీసుకోవాలని అయ్యన్న చూస్తున్నారు.

ఈ క్రమంలోనే అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి తన వారసుడిని బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి తరఫున ఆడారి ఆనంద్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఓడిపోయాక ఈయన వైసీపీలోకి వెళ్లిపోయారు. దీంతో అనకాపల్లికి పార్లమెంట్ స్థానం ఖాళీగా ఉంది. ఆస్థానంలోని తన కుమారుడు విజయ్‌ని బరిలోకి దింపాలని అయ్యన్న అనుకుంటున్నారు. ఇదే క్రమంలో వైసీపీలో ఉన్న అయ్యన్న సోదరుడు సన్యాసిపాత్రుడు కూడా అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టిడిపి తరఫున అయ్యన్న వారసుడు బరిలో ఉంటే వైసీపీ తరఫున సన్యాసిపాత్రుడుని దింపాలని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి నెక్స్ట్ ఎన్నికల్లో అయ్యన్న ఫ్యామిలీ రాజకీయాలు ఎలా ఉంటాయో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: