అమ్మా బైలెల్లినాదో.. తల్లీ బైలెల్లినాదో..!
హైదరాబాద్ లో బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. శాంతి భద్రతలను మరింత పటిష్ఠం చేశామన్నారు. తెలంగాణ వచ్చాకే బోనాలకు గుర్తింపు వచ్చిందనీ.. సీఎం కేసీఆర్ బోనాలను రాష్ట్రపండుగగా ప్రకటించారని గుర్తు చేశారు. సంస్కృతి, సంప్రదాయాలకు ఆయన పెద్ద పీట వేస్తున్నారని పేర్కొన్నారు. అటు నగరంలో బోనాల వేడుకలు కోలాహలంగా జరుగుతున్నాయి.
తెలంగాణలో బోనాలకు ప్రత్యేకత ఉంది. ఏటా ఒక సంప్రదాయంలా కొనసాగుతోంది ఈ పండుగ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దంలా బోనాల పండుగను నిర్వహిస్తుంటారు. పిల్లా..పెద్దలు.. మహిళలు అందరూ బోనాలను వేడుకగా నిర్వహించుకుంటారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. శివసత్తుల పూనకాల మధ్య బోనమెత్తుకొని అమ్మవారిని ఆశ్రయిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ వేడుకకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం సైతం బోనాలకు కొంత బడ్జెట్ ను కూడా కేటాయిస్తోంది.
పాతబస్తీలో జనసమ్మర్థం అధికంగా ఉంటుంది. జరగకూడనిది ఏది జరిగినా పెద్ద ఎత్తున నష్టం భరించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బోనాలు జరిగే ప్రాంతంలో ఘటాల ఊరేగింపు ఉండనుండగా.. వాహనాల రాకపోకలను ఆపేశారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. మరోవైపు మద్యం దుకాణాలకు మూసివేయించారు. ఈ ఆంక్షలు రేపటి దాకా కొనసాగనున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని ఇఫ్పటికే తెలంగాణ పోలీసు అధికారులు ప్రకటించారు.