ఈటల కోసం ప్రాణాలు ఇస్తానంటున్న తెలంగాణ మంత్రి ?

Veldandi Saikiran
ఇటీవల  తెలంగాణ రాష్ట్రంలో లో అతి కీలక నేత అయిన ఈటెల రాజేందర్  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మరియు తన ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  ఈటల రాజేందర్ రాజీనామా తో హుజూరాబాద్ నియోజక వర్గంలో  ఉప ఎన్నిక రానుంది. అయితే  హుజూరాబాద్  ఉప ఎన్నిక కు ఎన్నిక సంఘం నుంచి ఇంకా.. నోటిఫికేషన్ రానప్పటికి.. అన్నీ పార్టీలు ఇప్పటికే ప్రచారం సాగిస్తున్నాయి.  ప్రజల మన్ననలను పొందేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ తో పాటు విపక్ష పార్టీలు కూడా తమ తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. 


కొంత మంది లీడర్లు అయితే ఇప్పటి నుంచే ఓటర్లను కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో అధికార పార్టీ... ఒక అడుగు ముందే ఉందని చెప్పవచ్చు. అటు బిజెపి సైతం బహిరంగంగానే ఓటర్లకు గడియారాలు పంచుతూ అడ్డంగా దొరికింది. ఇంకా ఇటు బిజెపి తరఫున పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిన్నటి నుంచి ప్రచారం మొదలుపెట్టారు. ఆయన సొంత మండలం నుంచి ఆరంభించిన ఈ పాదయాత్ర ను... నియోజకవర్గం మొత్తం విస్తరించనున్నారు. అయితే ఈటెల రాజేందర్ పాదయాత్ర నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ మరియు బిజెపి పార్టీ నేతల మధ్య నిన్న కాస్త ఉద్రిక్తత నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


కరీంనగర్ జిల్లాలోని ఓ మంత్రి తనను చంపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ఆరోపించారు. దీనికోసం ఓ ముఠాను కూడా హుజురాబాద్ లో దించాడు అంటూ చెప్పుకొచ్చారు ఈటల రాజేందర్. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నికలు మరింత రాజుకున్నాయి. చాలా సున్నితంగా ఉండి ఈటల రాజేందర్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో... మరో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. అయితే దీనిపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తనదైన స్టైల్ లో స్పందించారు. ఓటమి భయం తో సానుభూతి రాజకీయాలకు ఈటల రాజేందర్ తెరలేపుతున్నారని చురకలు అంటించారు.


  హత్యకు కుట్ర చేస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తాను తప్పుకుంటానని చెప్పిన గంగుల.. నిరుపించలేకపోతే నువ్వు తప్పుకుంటావా ఈటల అంటూ సవాల్ విసిరారు. దీనిపై సిబిఐ విచారణకు తాను సిద్దమన్నారు. ఈటల రాజేందర్  ప్రాణాలకు తన  ప్రాణాలు అడ్డు వేసి కాపాడుకుంటా అని స్పష్టం చేశారు గంగుల కమలాకర్. అయితే దీనిపై ఈటల ఇంకా స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: