పవన్ ఎస్కేప్ పాలిటిక్స్... ఆ మ్యాటర్ నుంచి తప్పించుకునే ప్లాన్ ?
నిజానికి రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం.. దీనిపై నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయడం, పోలీసులు వారిపై కేసులు నమోదు చేయడం.. వంటివి వారం రోజుల కిందటే జరిగిపోయాయి. ఈ క్రమంలో దీనిని తనకు అనుకూలంగా మార్చుకున్న టీడీపీ యువ నాయకుడు , పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఉద్యమాలు చేశారు. ఆన్‌లైన్‌ను ఆధారంగా చేసుకుని తన విశ్వరూపం చూపించారు.
అయితే.. ఇదంతా జరిగిపోయిన తర్వాత.. ఇప్పుడు తీరిగ్గా పవన్ జాబ్ క్యాలెండర్‌పై స్పందించడం..ఉద్యమాలు చేస్తానని చెప్పడం ద్వారా.. ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని.. ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. త్వరలోనే తాను జాబ్ క్యాలెండర్‌పై కదంతొక్కుతానని పవన్ ప్రకటించారు. అయితే.. ఈ ప్రకటన వెనుక ఆయన చాలా పెద్ద రాజకీయ వ్యూహంతోనే ఉన్నారని అంటున్నారు పరిశీలకులు. ఒకటి.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై పవన్ నోరు మెదకపోవడంపై వస్తున్న విమర్శలను పక్కదారి పట్టించడం.
రెండు.. యువతను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయడం. రెండోది బాగానే ఉన్నప్పటికీ.. మొదటి వ్యూహం మాత్రం బెడిసి కొడుతుందని చెబుతున్నారు. ఎందుకంటే.. విస్తృత ప్రజా ప్రయోజనాలు ఉన్న నీటి విషయంలో పవన్ నోరు మెదకపకపోవడాన్ని.. ఎవరూ హర్షించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన దీని నుంచి తప్పించుకునేందుకే అన్నట్టుగా ఇప్పుడు జాబ్ క్యాలెండర్‌ను ఎంచుకున్నారని అంటున్నారు. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి.