బుగ్గన గిల్లి.. గిల్లించుకున్నారే.. !

VUYYURU SUBHASH
రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. రాష్ట్ర ప్ర‌బుత్వం ఒక‌వైపు అప్పులు చేస్తేనే త‌ప్ప న‌డ‌వ‌లేని ప‌రిస్థితిని తెచ్చుకుంది. సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లు గుదిబండ‌గా మారింద‌నేది వాస్త‌వం. ఏటా వేల కోట్ల రూపాయ‌లు.. సంక్షేమం పేరుతో పంపిణీ చేస్తున్న ప్రభుత్వానికి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. అయితే.. కేంద్రం నుంచి వ‌చ్చిన 41 వేల కోట్ల రూపాయ‌ల‌ను స‌మ‌యానికి ఖ‌ర్చు చేయ‌ని కార‌ణంగా.. వీటిపై ఆర్థిక శాఖ వివ‌ర‌ణ కోరింది. అంతేకాదు.. ఈ నిధుల‌ను వెన‌క్కి తీసుకుంటామ‌ని కూడా రాష్ట్ర ప్ర‌భుత్వానికి నోట్ పంపింది. దీనిపై వెంట‌నే స్పందించిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. ఈ నిధుల‌ను ఎందుకు ఖ‌ర్చుచేయ‌లేదో వివ‌ర‌ణ ఇచ్చారు.

అయితే.. ఇదే విష‌యంపై పీఏసీ చైర్మ‌న్‌గా ఉన్న టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు... ప‌య్యావుల కేశ‌వ్‌.. తీవ్రంగా స్పందించారు. ఆ 41 వేల కోట్ల‌ను ఎందుకు ఖ‌ర్చు చేయ‌లేద‌ని.. మీ సంక్షేమానికి ఆ నిధుల‌ను వాడితే..కేంద్రానికి లెక్క‌చెప్పాల్సి వ‌స్తుంద‌నే ఇలా చేశారా? అంటూ.. ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. ఇదే విష‌యంపై ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్‌కు ఫిర్యాదు కూడా చేశారు. అయితే.. ఇదంతా జ‌రిగి నాలుగు రోజులైంది. దీనిపై తాజాగా ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డిస్పందించారు. అంతా స‌వ్యంగానే ఉంద‌ని.. పీఏసీ చైర్మ‌న్ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఎదురు దాడి చేశారు. ఆ వెంట‌నే ప‌య్యావుల ప్రెస్‌మీట్ పెట్టి.. బుగ్గ‌న్‌కు కౌంట‌ర్ ఇచ్చారు.

``మేము గవర్నర్ గారికి ఇచ్చిన లేఖ పై ఆర్థిక మంత్రి బుగ్గన చాలా తేలికగా మాట్లాడారు. కాగ్ త‌ప్పుచేసింద‌ని.. ఢిల్లీ లో వాళ్లకు అర్థం కాలేదు అని మాట్లాడుతారా?`` అని ఫైరయ్యారు. అంతేకాదు.. 41 వేల కోట్ల విష‌యంపై గ‌వ‌ర్న‌ర్ నుంచి స‌మాధానం కోరితే.. ప్ర‌భుత్వం రాజ‌కీయ ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాద‌ని అన్నారు.  ఇక‌, 4 రోజులు పాటు మీ అధికారులు కసరత్తు చేసి చెపితే ఇప్పుడు మీడియా ముందుకు వస్తారా? అని బుగ్గ‌న‌ను నిల‌దీశారు. 17-06-2020 న ప్రిన్సిపాల్ సెక్రటరీ ఫైనాన్స్ , సి ఎస్ ని లెక్కలు అడిగానని తెలిపారు. తాము అడిగిన ప్ర‌శ్న‌కు కేవ‌లం ఒకే ఒక్క వాక్యంతో స‌మాధానం చెప్ప‌డాన్ని కూడా ప‌య్యావుల ప్ర‌శ్నించారు.

రాష్ట్ర ఖజానాకు సంబంధించి తాను చేసిన ఆరోపణలపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి జవాబు సరిగా లేదని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు.బ్యాంకు గ్యారంటీలపై ప్రశ్న అడిగితే ఏడాది తర్వాత జవాబిచ్చారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు పొందుపరిచారా? లేదా అని ప్రశ్నించారు. రూ.25 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీలను తెలియకుండా దాచారని ఆరోపించారు. బ్యాంకు పూచీకత్తులపైనా అబద్ధాలు చెబుతున్నారని పయ్యావుల విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టులో ఛాలెంజ్ చేశామన్న ఆయన.. జీవోలో ఒకటుంటే.. కోర్టులో మరో విషయం చెప్పారని  ఆక్షేపించారు.

పీఏసీ ఛైర్మన్‌, ప్రతిపక్షం ఎలా ఉండాలో మీరే చెబుతారా?  ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసేది ఎవరు? మేం ఢిల్లీ వెళ్తాం.. మీరు చేసిన కార్యక్రమాలు వివరిస్తాం. రాజ్యాంగం చెప్పినట్లే మీరు నడుచుకోవాలి.  బ్యాంకు గ్యారంటీల గురించి శాసనసభలోనూ దాచారు. మేం ప్రశ్నించినప్పుడు కనీసం శాసనసభకైనా జవాబు చెప్పాలి. రూ.25 వేల కోట్లు అనేది  ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి చేసిన అప్పు.. అని ప‌య్యావుల పేర్కొన్నారు. మొత్తానికి రూ.41 వేల‌ కోట్ల వివాదం.. ఇరు ప‌క్షాల మ‌ధ్య తీవ్ర వివాదంగా మారుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: