ఆ టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్ భారీగానే ఉంటుందట...!
ఏపీలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలం 19. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున 23 మంది గెలిచిన విషయం తెలిసిందే. జగన్ వేవ్‌ని తట్టుకుని 23 మంది గెలిస్తే, అందులో నలుగురు చంద్రబాబుకు షాక్ ఇచ్చి, జగన్‌కు మద్ధతు తెలిపారు. మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్, కరణం బలరాంలు వైసీపీ వైపుకు వచ్చారు. దీంతో టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు మిగిలారు.
అయితే ఈ రెండేళ్లలో 19 మంది ఎమ్మెల్యేల గెలిచిన నియోజకవర్గాల్లో చాలా వరకు వైసీపీకి లీడింగ్ వచ్చిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చంద్రబాబు కుప్పం, బాలయ్య హిందూపురం నియోజకవర్గాల్లో టీడీపీకి కాస్త అనుకూల పరిస్తితులే ఉన్నాయని, వాటిని పక్కనబెడితే మిగిలిన 17 నియోజకవర్గాల్లో టీడీపీ కొన్ని చోట్ల వీక్ అయిందని తెలుస్తోంది. అదే సమయంలో ఆ నియోజకవర్గాల్లో వైసీపీ బాగా పుంజుకుందని విశ్లేషణలు వస్తున్నాయి.
మొదటగా చూసుకుంటే రేపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బలం తగ్గిపోయిందని అంటున్నారు. ఇటీవల పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ టీడీపీ సత్తా చాటలేకపోయింది. ఇక అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ ఉన్నారు. ఆయనని వైసీపీ ప్రభుత్వం గట్టిగానే టార్గెట్ చేసింది. దీంతో అద్దంకిలో టీడీపీకి బలం తగ్గినట్లే కనిపిస్తోందని అంటున్నారు. అటు పర్చూరులో టీడీపీ పరిస్తితి బాగానే ఉంది. కానీ కొండపిలో మాత్రం టీడీపీ వీక్ అయినట్లు కనిపిస్తోంది.
ఇక ఉరవకొండలో పయ్యావుల కేశవ్ యాక్టివ్‌గా ఉండటం లేదు. దీంతో ఆ నియోజకవర్గంలో టీడీపీకి అనుకూల పరిస్తితులు లేవు. ఇటు విజయవాడ ఈస్ట్ స్థానంలో వైసీపీ బాగా పుంజుకుంది. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉన్నా సరే, పరిస్తితులు వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు అనుకూలంగా ఉన్నాయి. టెక్కలి, పాలకొల్లు, ఉండి, రాజమండ్రి రూరల్, సిటీ నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్తితి పర్లేదు. మండపేట, పెద్దాపురం, విశాఖ నార్త్, వెస్ట్, ఈస్ట్, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో టీడీపీ బలం తగ్గిందని చెబుతున్నారు. మొత్తానికైతే వచ్చే ఎన్నికల్లో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రం భారీ షాకులు తగలడం ఖాయమని అంటున్నారు.