ఆలీకి ఏమన్నా సెట్ చేస్తారా?
సినీ నటులు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం సర్వ సాధారణమే. దివంగత ఎన్టీఆర్ సినిమాల నుంచే వచ్చి రాజకీయాల్లో సక్సెస్ అయ్యి, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇక ఎన్టీఆర్‌ని ఆదర్శంగా తీసుకునే చాలామంది నటులు రాజకీయాల్లోకి వచ్చారు. అయితే గతంలో సినీ నటుల మద్ధతు టీడీపీకి ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్తితి మారింది. సినీ పరిశ్రమ తెలంగాణలో ఉండటంతో అక్కడ ఉన్న కేసీఆర్ ప్రభుత్వానికి నటుల మద్ధతు ఎక్కువగా ఉంది.
అలాగే కొందరు ఏపీలో అధికారంలో ఉన్న జగన్‌కు సపోర్ట్ ఇస్తున్నారు. మరికొందరు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనకు మద్ధతుగా ఉన్నారు. అంటే గతంలో టీడీపీకి మద్ధతు ఇచ్చినవారు ఇప్పుడు అవకాశాలు కోసం వేరే పార్టీల వైపుకు వచ్చేశారు. గతంలో టీడీపీకి సపోర్ట్‌గా ఉన్న సినీ నటుడు ఆలీ సైతం ఇప్పుడు వైసీపీ వైపుకు వచ్చేశారు.
చాలా ఏళ్ళు ఆలీ తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేశారు. 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆలీ మద్ధతు ఉంది. అలాగే టీడీపీ నుంచే ఆలీ 2019 ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. కానీ అనుహ్యా పరిణామాల మధ్య ఆలీ వైసీపీలోకి వచ్చారు. వైసీపీలోకి వచ్చాక ఆలీకి ఏదొక సీటు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఎన్నికల్లో ఆలీకి ఏ సీటు రాలేదు. కాకపోతే ఆలీ వైసీపీ నాయకులకు మద్ధతుగా ప్రచారం చేశారు.
ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆలీకి జగన్ ఏదొక పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌తో పాటు ఎమ్మెల్సీ పదవి ఆలీకి ఇస్తున్నారని ఆ మధ్య ప్రచారం కూడా జరిగింది. ఇంతవరకు ఆలీకి ఎలాంటి పదవి దక్కలేదు. అయితే భవిష్యత్‌లో ఆలీకి ఏదొక పదవి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో ఆలీ పోటీ చేయాలని అనుకుంటున్నారని సమాచారం. మరి చూడాలి ఆలీని జగన్ వచ్చే ఎన్నికల బరిలో నిలబెడతారో లేదో.