పితాని సైడ్ అయిపోయినట్లేనా!

M N Amaleswara rao

పశ్చిమ గోదావరి జిల్లాలో బలమైన సామాజికవర్గాల్లో శెట్టిబలిజ కూడా ఒకటి. జిల్లాలో రాజకీయాలని కాపులు, రాజులతో పాటు శెట్టిబలిజలు కూడా శాసిస్తారు. పలు నియోజకవర్గాల్లో పార్టీ గెలుపోటములకు శెట్టిబలిజలు కీలకం అవుతారు. అలాంటి సామాజికవర్గంలో బలమైన నాయకుడుగా ఉన్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండటం లేదు.


గతంలో కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేసిన పితాని 2009లో ఆచంట నుంచి గెలిచారు. ఇక రాష్ట్ర విభజన జరగడంతో కాంగ్రెస్ పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది. దీంతో పితాని టీడీపీలోకి వచ్చేశారు. మళ్ళీ 2014 ఎన్నికల్లో ఆచంట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలాగే చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా ఛాన్స్ కొట్టేశారు. ఇక అధికారం, పదవి ఉన్నన్ని రోజులు ఏపీ రాజకీయాల్లో పితాని బాగా హడావిడి చేసేవారు.


కానీ 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. మళ్ళీ టీడీపీ తరుపున ఆచంటలో పోటీ చేసిన పితాని, జగన్ వేవ్‌లో ఓటమి పాలయ్యారు. 12 వేల మెజారిటీతో చెరుకువాడ రంగనాథరాజుపై ఓడిపోయారు. ఓడిపోయాక పితాని ఏపీ రాజకీయాల్లో పెద్దగా సందడి చేయట్లేదు. అయితే పితాని సైలెంట్ అయిపోవడానికి కారణాలు లేకపోలేదు. ఈ‌ఎస్‌ఐ స్కామ్ విషయంలో పితానిపై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా కార్మిక మంత్రిగా అచ్చెన్నాయుడు ఒక టర్మ్, పితాని సత్యనారాయణ ఒక టర్మ్ పనిచేశారు.


అప్పుడు ఈ‌ఎస్‌ఐలో పలు అక్రమాలు జరిగాయని చెప్పి జగన్ ప్రభుత్వం అప్పుడు మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడుని జైలుకు కూడా పంపింది. దీంతో పితాని కూడా జైలుకు వెళ్ళడం ఖాయమని ప్రచారం జరిగింది. ఆ సమయంలోనే పితాని వైసీపీలో వెళ్తారని వార్తలు కూడా వచ్చాయి. కానీ పితాని పార్టీ మారలేదు. అలా అని టీడీపీలో కనిపించడం లేదు. అచ్చెన్న జైలుకెళ్లి బయటకొచ్చేసిన సరే, పితాని టీడీపీలో యాక్టివ్ అవ్వలేదు. మరి చూడాలి పితాని టీడీపీ నుంచి సైడ్ అయిపోతారో లేక పార్టీలో కనిపిస్తారో?    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: