ఆ విషయంలో గౌతమ్ రెడ్డి టార్గెట్ అయిపోయారుగా!

M N Amaleswara rao

ఏపీలో సంక్షేమ పథకాలు అమలులో జగన్ ప్రభుత్వం ఎలాంటి లోటు చేయని సంగతి తెలిసిందే. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందిస్తుంది జగన్ ప్రభుత్వం. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ఎన్నికల ముందు తాను ఇచ్చిన హామీలని ప్రతిదీ అమలు చేయడమే లక్ష్యంగా వెళుతున్నారు. ఈ రెండేళ్లలో చాలావరకు హామీలని అమలు చేశారు. అసలు ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేశారు.


సరే ఏ ప్రభుత్వానికైనా సంక్షేమం, అభివృద్ధి అనేవి రెండు కళ్ళులాగా ఉండాలి. మరి సంక్షేమంలో టాప్‌లో ఉన్న జగన్ ప్రభుత్వం అభివృద్ధిలో ఎక్కడ ఉంది? అంటే చెప్పడం కష్టమే. ఈ రెండేళ్ళులో రాష్ట్రంలో పెద్దగా అభివృద్ధి జరగలేదనే చెప్పొచ్చు. రెండేళ్లలో రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడులు కూడా తక్కువే అని చాలామంది రాజకీయ పెద్దలు చెబుతున్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాల విమర్శలు పక్కనబెడితే న్యూట్రల్‌గా ఉండే రాజకీయ పరిశీలకులు, ప్రజలు సైతం అసంతృప్తిగానే ఉన్నారు.


ఎందుకంటే రాష్ట్రంలో చెప్పుకోదగిన అభివృద్ధి జరగలేదని తెలుస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం అలా చెప్పడంలేదు. ఈ రెండేళ్లలో రాష్ట్రానికి పెట్టుబడుల వరద కొనసాగిందని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. గత రెండేళ్లలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెబుతున్నారు. అలాగే 65 పెద్ద పరిశ్రమలు వచ్చాయని, 45 వేల ఉద్యోగాలు వచ్చాయని అంటున్నారు.


అదేవిధంగా రాష్ట్రంలో వచ్చిన కంపెనీల పేర్లు కూడా మంత్రి చెబుతున్నారు. అయితే మంత్రి ఇక్కడే తప్పులో కాలు వేశారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. మంత్రి చెప్పే కంపెనీలు, చంద్రబాబు హయాంలో వచ్చినవే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. ఆఖరికి కియా మోటార్స్ , దానికి అనుబంధంగా వచ్చిన కంపెనీలు సైతం ఈ రెండేళ్లలో వచ్చినట్లు చూపిస్తున్నారు. ఇక దీనిబట్టే అర్ధం చేసుకోవచ్చని, మంత్రి లెక్కలు ఎలా ఉన్నాయో? అభివృద్ధి ఏ మేర జరిగిందో అని అంటున్నారు. ప్రతిపక్షాల విమర్శలే కాకుండా వాస్తవానికి చూస్తే మంత్రి చెప్పిన వాటిల్లో ఎక్కువ కంపెనీలు టీడీపీ హయాంలో వచ్చినవే. అందుకే టీడీపీ శ్రేణులు మంత్రిని గట్టిగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: