రామ్మోహన్ ఆ విషయం మర్చిపోయినట్లున్నారు....!

M N Amaleswara rao

టీడీపీలో కీలకంగా ఉన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు....ఈ మధ్య కాస్త దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన డిజిటల్ మహానాడు కార్యక్రమంలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన, రామ్మోహన తాజాగా ప్రత్యేక హోదా అంశంలో జగన్‌పై విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో 25కి 25 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని చెప్పిన జగన్, కేసులకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టారని ఫైర్ అయిపోయారు. వైసీపీకి 22 లోక్‌సభ, 6 గురు రాజ్యసభ సభ్యులున్న సరే హోదా తీసుకురావడంలో జగన్ విఫలమయ్యారని, కనీసం విభజన హామీలపై కేంద్రంతో పోరాడలేకపోతున్నారని అంటున్నారు.


అయితే గతంలో టీడీపీ అధికారంలో ఉండగా హోదా అంశాన్ని చంద్రబాబు ఎలా పక్కకు తెప్పించారో తెలుసని, ప్యాకేజ్ ఒప్పుకుని రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెట్టింది చంద్రబాబే అని వైసీపీ శ్రేణులు రామ్మోహన్‌కు కౌంటర్ ఇస్తున్నాయి. అప్పుడు బీజేపీతో పొత్తులో ఉండి కనీసం రాష్ట్రం కోసం ఏం సాధించారని ప్రశ్నిస్తున్నారు. కాకపోతే తమ నాయకుడు ఎన్నికల ముందు హోదా పొరాడి తీసుకోస్తానని చెప్పారని, కానీ మళ్ళీ కేంద్రంలో బీజేపీ మంచి మెజారిటీతో అధికారంలోకి రావడంతో, హోదా కాస్త దూరంగా కనబడుతుందని జగన్ చెప్పారని అంటున్నారు.


ఇక కేంద్రాన్ని ప్లీజ్, ప్లీజ్ అని అడగటం తప్ప, మనం ఏం చేయలేమని మొదట్లోనే జగన్ నిజాయితీగా హోదా విషయంలో చెప్పారని గుర్తుచేస్తున్నారు. కానీ బాబు అలా కాకుండా మొదట బీజేపీతో అంటకాగి, తర్వాత బయటకొచ్చి ధర్మపోరాట దీక్షల పేరిట హడావిడి చేశారని, అసలు హోదా అంశం పక్కకు వెళ్లిపోవడానికే కారణం బాబు అని, ఆ విషయం రామ్మోహన్ గుర్తు తెచ్చుకుంటే బెటర్ అని అంటున్నారు.


అయితే ఈ రెండు పార్టీలు హోదా గానీ, విభజన హామీలు సాధించడంలో విఫలమయ్యాయని, చంద్రబాబు, జగన్‌లు సొంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అవసరాన్ని బట్టి కేంద్రంతో దోస్తీ చేస్తూ, రాష్ట్ర ప్రజలని మోసం చేస్తున్నారని కొందరు న్యూట్రల్ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: