తెలంగాణా ప్రభుత్వంలో జరుగుతున్న అతిపెద్ద తప్పు ఏంటీ...?
తెలంగాణ ప్రజల దశాబ్దాల కాలం నాటి కల నెరవేరింది. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఇక ఒక పసికూన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రస్తుతం దేశానికే తలమానికంగా నిలుస్తోంది. ఎంతోమంది పోరాట యోధులు, విద్యార్థులు, ఉద్యమ నాయకుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో.. తమ బ్రతుకులు మారుతాయని అటు నిరుద్యోగులు ఉద్యమకారులు కూడా అనుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తోంటే తెలంగాణ ఉద్యమకారులకు,ప్రాణాలను అర్పించిన విద్యార్థులకు కాదు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారి కాలం నడుస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన రఘునందన్ రావు, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళను పార్టీ నుంచి బయటకు పంపించేశారు కేసీఆర్. ప్రస్తుతం ఎంతో మంది టీడీపీ కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చిన నేతలకే ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ మంత్రి పదవులు కట్టబెట్టడం లాంటివి కూడా చేస్తున్నారు. ఇలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు కాకుండా.. ఉద్యమాన్ని వ్యతిరేకించిన నాయకులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పంచన చేర్చుకుంటున్నారు అన్న అపఖ్యాతిని మూటగట్టుకుంటూన్నారు. ఇప్పటికే ఎంతో మంది ఉద్యమకారులు టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చారు. ఇక ఇటీవల తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఈటల రాజేందర్ సైతం పార్టీ నుంచి బయటకు రావడం సంచలనంగా మారింది.