కరోనా తగ్గుముఖం పడుతోందని నిర్లక్ష్యం వహిస్తున్నారా ?
గణాంకాల ప్రకారం కరోనా నమోదు సంఖ్య కంటే రికవరీ ఎక్కువగా ఉండడం సంతోషించాల్సిన విషయం. అయితే కరోనా మరణాల సంఖ్య గత వారంతో పోలిస్తే తగ్గుతున్నప్పటికీ ఆశించిన రీతిలో మాత్రం మరణాల రేటు తగ్గటం లేదు. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3847 మంది కరోనా పేషెంట్లు మరణించారు. రానురాను ఈ సంఖ్య బాగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,73,69,093 కి చేరగా, వీరిలో ఇప్పటి వరకు 2,46,33,951 మంది రికవరీ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు 3,15,235 మంది కరోనా బాధితులు మరణించారు.
ఇప్పుడు కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్న మరో విషయం ఏమిటంటే ? దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడం ఆనందించదగ్గ విషయమే, కానీ ఇప్పుడే ప్రజలు అప్రమత్తం అవ్వాలి. లేదంటే విషయం మళ్లీ మొదటికి వస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు. పోయిన సారి కూడా కరోనా కాస్త తగ్గగానే ప్రజలు మళ్లీ యధావిధిగా రోడ్లపైకి రావడం మొదలుపెట్టారు. దానితో కరోనా తీవ్రత బాగా పెరిగి రెండవ దశ మొదలైంది. కానీ ఇప్పుడు మళ్లీ ఆ పొరపాటు జరగకుండా ఉండాలంటే, కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ నిబంధనలు తప్పక పాటించాలి. దేశంలో 70 శాతం మందికి పైగా వ్యాక్సిన్ వేసుకునే వరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.