వైరల్: 17 నిమిషాల్లోనే పూర్తయిన పెళ్లి..?

Suma Kallamadi
ఆకాశమంత పందిరి వేసి ఐదు రోజుల పెళ్లి చేసే రోజులు ఎప్పుడో పోయాయి. ఇక ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా ఒక రోజాంత జరగాల్సిన పెళ్లి తంతు నిమిషాల్లోనే పూర్తవుతోంది. అక్షయ తృతీయ పర్వదినాన అనగా మే 14వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, షాజహన్‌పూర్ జిల్లా, కలాన్ తహసీల్ పరిధిలోని పట్నా దేవ్‌కలి శివాలయంలో ఒక పెళ్లి కేవలం 17 నిమిషాల్లో పూర్తయింది.

కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అధికారుల అనుమతితో కరోనా నిబంధనలు పాటిస్తూ వధూవరులు అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా పెళ్లి ముహూర్తాన వధువు మెడలో వరుడు తాళి కట్టి ఆమెతో కలిసి ఏడడుగులు వేయగానే పెళ్లి తంతును ముగించారు. ఏ హంగు ఆర్భాటాలు లేకుండా ఈ పెళ్లి చాలా సింపుల్ గా పూర్తి కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కనీసం బ్యాండ్ బాజా కూడా లేకపోవడం విశేషం. ఊరేగింపు కార్యక్రమం కూడా జరగలేదు. దీంతో ఈ వధూవరుల 17 నిమిషాల పెళ్లి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.


17 నిమిషాల్లోనే పెళ్లి పూర్తిచేసిన వధూవరులు వివరాలు తెలుసుకుంటే.. కలాన్ థానే ప్రాంతంలోని సనాయ్ గ్రామంలో నివసిస్తున్న పుష్పిందర్ దుబే గ్రామంలో ఒక విద్యా సంస్థను నడుపుతున్నాడు. ఆయన బీజేపీ ప్రధాన కార్యదర్శి, మీడియా కార్యకర్త గా కూడా వ్యవహరిస్తున్నాడు. అతను హార్డోయికి చెందిన ప్రీతి తివారీని వివాహం చేసుకున్నాడు. అయితే వరకట్నంగా పుష్పిందర్ వధువు కుటుంబం నుంచి విలువైన వస్తువులు గాని డబ్బులు గానీ తీసుకోవడానికి ఇష్టపడలేదు. అప్పటికే ఒక ఖరీదైన కారు తో పాటు మరొక హుండా కారు వధువు కుటుంబ సభ్యులను ఇవ్వడానికి సిద్ధమయ్యారు కానీ వరుడు తనకేమీ వద్దని చెప్పి అందరి మనసులను గెలుచుకున్నారు.


పెళ్లికి హాజరైన అతిథులతో సహా వధూవరులు కూడా వరకట్న విధానానికి వ్యతిరేకంగా ఉంటూ యువతకు ఆదర్శంగా నిలిచారు. ఆడబిడ్డ తల్లిదండ్రుల నుంచి కట్నకానుకలు తీసుకోకూడదని.. ప్రజలకు అమ్మాయి విలువేంటో తెలియజేయాలని పుష్పిందర్ చెప్పుకొచ్చారు. అయితే వధువు మాట్లాడుతూ వరకట్నం చాలా కుటుంబాలను నాశనం చేసిందని అన్నారు. వరకట్న విధానాన్ని నాశనం చేయాలంటే నేటి యువత అంతా కలిసికట్టుగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: