రంజాన్ పండగ ప్రాముఖ్యత ఏంటో తెలుసా..!

N.ANJI
ముస్లింలు జరుపుకునే పండగల్లో రంజాన్ పెద్ద పండగ. ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్ ని అనుసరిస్తారు. ఈ క్యాలెండర్ లో వచ్చే తొమ్మిదో నెల రంజాన్. ఈ మాసాన్ని ముస్లిములు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న రంజాన్‌ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన 'రోజా' ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది. మహ్మద్‌ ప్రవక్త లా ఇల్లాహ ఇల్లాల్ల అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతోంది.

ఇక ఈ మాసంలో రోజుకు ఐదు పర్యాయాలు నమాజ్‌తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పవిత్ర మాసంలో దానధర్మా లకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుతారని, నరకపు ద్వారాలు మూసి ఉంటాయని ముస్లింల ప్రగాఢ నమ్మకం. రంజాన్ మాసంలో సూర్యోదయం కంటే ముందు నుండి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం, కనీసం ఉమ్మి కూడా మింగ కుండా కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. ఉపవాస దీక్షల వల్ల జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రం చెబుతుంది. ఉపవాస దీక్షలు (రోజా)సహారీతో ప్రారంభమై ఇఫ్తార్‌తో ముగుస్తుంది.

అయితే ఈ మాసంలో ముందుగా ఖర్జూరపు పండు తిని దీక్ష విరమించే ముస్లింలు ఆ తర్వాత పలురకాలైన రుచికరమైన వంటకాలను భుజిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రయాణంలో ఉన్న వారు ఉపవాసదీక్ష ఉప్పుతో కూడా విరమించే అనుమతిఉంది. ఈ వంటకాలతో పాటు సంప్రదాయ వంట హలీమ్‌ను తయారు చేసుకుని తింటారు. వీటికి సంబంధిన ప్రత్యేక హోటళ్ళు కూడా ఉంటాయి. ఇక కళ్లకు ‘సుర్మా' పెట్టుకోవడం కూడా ముస్లింలు సున్నత్‌ గానే భావిస్తారు. ప్రవక్త హజరత్‌ మహ్మద్‌ సదా సుర్మా పెట్టుకునేవారని అంటారు. కాటుక లాగే కళ్లకు రాసుకునే సుర్మా పౌడర్‌ రూపంలో ఉంటుంది. ముస్లింలు అందమైన భరిణెల్లో వీటిని దాచుకొని ఇంటికి వచ్చిన అతిథులకు అత్తరుతో పాటు కళ్లకు పెట్టు కోవడానికి కూడా ఇవ్వడం సంప్రదాయంగా భావిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: