కని "కరోనా":కరోనా కొత్త మ్యుటేషన్లను కూడా అడ్డుకోగల కొవాగ్జిన్‌: ఐసీఎంఆర్‌

Suma Kallamadi
భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్ -19 వ్యాక్సిన్ "కొవాగ్జిన్‌" సార్స్‌కోవ్‌-2 లోని పలురకాల వైరస్ లను సమర్థవంతం అడ్డుకోగలదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్‌) వెల్లడించింది. దీన్నిబట్టి సార్స్‌కోవ్‌-2 లో కొత్త మ్యుటేషన్లను సైతం అడ్డుకొని హానికరమైన వైరస్ లపై ప్రతికూలత ప్రభావం చూపించి మనుషుల ప్రాణాలను కొవాగ్జిన్‌ టీకా కాపాడగలదని తెలుస్తోంది. అంతేకాదు ఈ కొవాగ్జిన్‌ ఇటీవల కాలంలో భారత్‌లో కనిపిస్తున్న డబుల్‌ మ్యూటెంట్‌ ‌జాతి వైరస్ ను కూడా అడ్డుకోగలదని ఐసీఎంఆర్‌ తమ ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.


ఐసీఎంఆర్‌ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంస్థ విజయవంతంగా యూకే, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా రకం వైరస్‌లను అధ్యయనం కోసం లేబరేటరీలో బంధించి.. కల్చర్ చేసింది. అయితే బంధించిన ఈ మూడు రకాల వైరస్లలో యూకే, బ్రెజిల్‌ రకం వైరస్‌లను అత్యంత సమర్థవంతంగా అడ్డుకోగల సామర్థ్యం కొవాగ్జిన్‌ కి ఉందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంస్థ తమ పరీక్షలలో నిరూపించినట్లు అపెక్స్ హెల్త్ రీసర్చ్ బాడీ వెల్లడించింది. డబుల్‌ మ్యూటెంట్‌ ‌జాతి వైరస్ ను బంధించి వాటిపై కూడా పరీక్షలు చేయగా.. కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ వాటిని కూడా నిలువరించగలదని నిరూపితమయిందని ఐసీఎంఆర్‌ తెలిపింది.



ఇకపోతే భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ కొవిడ్‌ టీకా తీసుకొన్న తర్వాత కూడా ఇన్ఫెక్షన్లు వస్తే భయపడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇంజక్షన్ రూపంలో తీసుకునే కరోనా వ్యాక్సిన్ ఉపిరితిత్తుల కింద భాగంలో రక్షిస్తుందని పైభాగంలో కాదని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం అత్యవసరమని.. ఒక వేళ కరోనా సోకితే అది ప్రాణాంతకంగా అస్సలు మారదని ఆయన చెప్పినట్టు ఒక వార్తా సంస్థ వెల్లడించింది.



భారతదేశంలో ఒకవైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగి పోతుంటే.. మరోవైపు వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. దీంతో భారత్ బయోటెక్ సంస్థ వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచాలని ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ లేదా ఆగస్టు నెల లోపు 70 కోట్ల కొవాగ్జిన్‌ టీకా డోసులు తయారు చేసే సామర్థ్యం తమకు చేకూరుతుందని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: