బాలయ్య చిన్నల్లుడు సెట్ చేసుకున్నట్లేనా..

M N Amaleswara rao


ఏపీలోని 13 జిల్లాలో వైసీపీ డామినేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల వెలువడిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లోనే వైసీపీ వేవ్ ఎలా ఉందో అంతా చూశారు. వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. ఇక ప్రతిపక్ష టీడీపీ, వైసీపీకి పూర్తి స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయింది. టీడీపీ మరీ ఘోరంగా ఓడిపోయింది. మున్సిపాలిటీలతో పాటు ప్రతి కార్పొరేషన్‌లోనూ టీడీపీకి అనుకూల ఫలితాలు రాలేదు.


అలాగే అమరావతికి పక్కనే ఉన్న గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ స్థానాల్లో వైసీపీనే గెలిచింది. 

అటు విశాఖపట్నంలో కూడా వైసీపీనే గెలిచింది. అయితే ఇక్కడ విశాఖపట్నంలో టీడీపీ మరీ ఘోరంగా ఓడిపోలేదు. ఊహించని దానికంటే ఎక్కువగానే డివిజన్లు దక్కించుకుంది. జగన్ విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన దగ్గర నుంచి టీడీపీకి కష్టకాలం మొదలైన విషయం తెలిసిందే.


ఒకానొక సమయంలో విశాఖలో చంద్రబాబు అడుగుపెట్టలేని పరిస్తితి వచ్చింది. అలాగే ఒక ఎమ్మెల్యే వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలో టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా 90 డివిజన్లలో టీడీపీ 30 చోట్ల గెలిచింది. ఇక టీడీపీ పొట్టుతో సి‌పి‌ఐ రెండు చోట్ల గెలిచింది. వైసీపీ 58 చోట్ల గెలిచి స్వల్ప ఆధిక్యంతో కార్పొరేషన్ సొంతం చేసుకుంది.


టీడీపీ ఈ స్థాయిలో గెలవడానికి స్థానిక ఎమ్మెల్యేలు అసలు కారణం కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే వారి నియోజకవర్గాల్లో టీడీపీ తక్కువ డివిజన్లు గెలిచింది. భీమిలి, పెందుర్తి, గాజువాక స్థానాల్లో టీడీపీ మంచి విజయాలు దక్కించుకుంది. దీనికి కారణం విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్‌లు అని చెప్పొచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పల్లా దీక్ష చేసిన విషయం తెలిసిందే.


ఇటు భరత్ విశాఖ పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతం కోసం సైలెంట్‌గా పనిచేసుకుంటూ వచ్చారు. ఎమ్మెల్యేలు కొన్ని ఒత్తిళ్ళ వల్ల పార్టీని లైట్ తీసుకుంటే పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా భరత్ బాగానే కష్టపడ్డారు. అయితే గత ఎన్నికల్లోనే తక్కువ మెజారిటీతో విశాఖలో ఓడిన భరత్, నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. మొత్తానికైతే విశాఖలో బాలయ్య చిన్నల్లుడు గెలవడానికి అన్నీ మార్గాలని సెట్ చేసుకుంటున్నట్లే కనిపిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: