తెలంగాణలో ఎన్నికలకు మోగిన నగరా..!
తెలంగాణ రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 29తో ఖాళీ అయ్యే రెండు గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్, 23న నామినేషన్లకు చివరి తేదీ అని సీఈసీ షెడ్యూల్ లో ప్రకటించింది. ఇక 24న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 26న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా తెలిపారు. మార్చి 14న ఎమ్మెల్సీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మార్చ్ 17న ఓట్ల లెక్కింపు ఉంటుందని సీఈసీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎన్నిక కోడ్ అమలులోకి వచ్చింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో 5లక్షల 21వేల 386 మంది ఓటర్లు ఉన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో 4లక్షల 92వేల 943ఓటర్లు ఉన్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు నల్గొండలో నామినేషన్లు దాఖలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పరిధిలో పోటీ చేసే వారు హైదరాబాద్‌లో నామినేషన్లు దాఖలు చేసుకోవాలని సూచించారు అధికారులు.
ఎమ్మెల్సీ నోటిఫికేషన్‌కు ముందే పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి టీఆర్ఎస్ మినహా ఇతర పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి చిన్నారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, వామపక్షాల మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ కే.నాగేశ్వరరావుతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి రాములు నాయక్, బీజేపీ తరపున ప్రేమేందర్ రెడ్డి, తెలంగాణ జన సమితి నుంచి ప్రొఫెసర్ కోదండరాం, వామపక్షాల అభ్యర్థిగా జయసారథి రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి చెరుకు సుధాకర్ గౌడ్, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా రాణి రుద్రమ, చింతపండు నవీన్ పోటీలో ఉన్నారు.
ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ రావడంతో అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేశారు. పోలింగ్ సెంటర్లను కూడా ప్రకటించారు.