జనం మదిలో సవాలక్ష అనుమానాలు..!
సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ మధ్య జరుగుతున్న టీకా యుద్ధంలో రాజీ కుదిరింది. తమ టీకా గొప్పదంటే తమ టీకా గొప్పదని చెప్పుకోవడమే కాకుండా.. మీ టీకాతోనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మా టీకానే ఒరిజినల్.. మిగతావన్నీ వట్టి నీళ్లేనంటూ సీరం సంస్థ నోరు జారింది. భారతీయులపై ప్రయోగాలు చేయని సీరం సంస్థకి అనుమతులెందుకిచ్చారంటూ అటు భారత్ బయోటెక్ ఆరోపించింది. భారత్ లో అత్యవసర వినియోగానికి ఆమోదం తెచ్చుకున్న రెండు కంపెనీలు ఇలా బజారున పడటంతో ప్రజల్లో అయోమయం ప్రారంభమైంది.
ప్రజలకి టీకాలు వేయాల్సిన రెండు కంపెనీలు, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుని, చివరకు ఇలా సమాచార లోపం అంటూ సర్దిచెప్పుకోవడమమేంటనే అనుమానాలు వచ్చాయి. వాస్తవానికి సీరం సంస్థ తీసుకువచ్చిన కొవిషీల్డ్ టీకాను భారత్ లో ఎక్కువమంది వాలంటీర్లపై ప్రయోగించలేదు. లండన్ లో చేపట్టిన ప్రయోగాలను, అక్కడి వాతావరణ పరిస్థితులు, ప్రజల రోగనిరోధక శక్తిని.. ఇక్కడితో పోల్చలేం. అయినా సరే హడావిడిగా డిసీజీఐ కొవిషీల్డ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాక్సిన్ కి కూడా అనుమతి ఇచ్చారు.. మొత్తానికి టీకాలపై ప్రజల్లో మరిన్ని అనుమానాలు, భయాలు పుట్టుకొచ్చాయనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. అమెరికా, యూకేలో టీకా పంపిణీ ప్రారంభం కాగా... మన దేశంలోనూ ఈనెల 16 నుంచి కొనసాగుతోంది.
ఇటీవలే హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ కి ఇన్ఫెక్షన్ రావడం తో వ్యాక్సిన్ల పనితీరుపై సామాన్యుల్లో అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఇన్ఫెక్షన్ సోకడానికి రెండు వారాల ముందే ఆయన ఈ వ్యాక్సిన్ తీసుకోవడంతో అది టీకాలోని వైరస్ వల్ల వచ్చిందా... లేక సరిగా పనిచేయనందున సోకిందా అన్న సందేహాలు వచ్చాయి. దీంతో ఫైజర్ మీద సిందిగ్ధత మొదలైంది. కాలిఫోర్నియాలోని 45 ఏళ్ల నర్సులో వ్యాక్సిన్ వేసుకున్న వారానికి కరోనా లక్షణాలు కనిపించాయి. పోర్చుగల్‌లో కూడా ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజులకే నర్సు చనిపోయింది. భయాలు మరింత ఎక్కువయ్యాయి.