మహంతి దూకుడు...జగ్గారెడ్డి బ్రేక్

 సంగారెడ్డి: దూకుడుగా వ్యవహరిస్తున్న మెదక్ జిల్లా ఎస్పీ అవినాష్ మహంతికి సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. మెదక్ జిల్లాలో నెలకుని ఉన్న రాజకీయాల నేపథ్యంలో కాస్త కఠినంగా వ్యవహరించే ఎస్పీని నియమించాలనే ఉద్దేశంతో సీఎం కిరణ్ అవినాష్ మహంతిని ఎస్పీగా నియమించారు. జిల్లాలోని ఏ ప్రజా ప్రతినిధుల మాటల్ని కూడా అవినాష్ వినడం లేదనే ఆరోపణ వుంది. డిప్యూటీ సీఎం రాజనర్సింహ మాటను కూడా అవినాష్ ఖాతరు చేయడం లేదనీ జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. చివరకు, సీఎం కిరణ్కు అత్యంత సన్నిహితుడైన జగ్గారెడ్డి మాటను కూడా అవినాష్ వినకుండా అంతా తానొక్కడినే అనే విధంగా వ్యవహారిస్తుండటంతో జగ్గారెడ్డికి చిర్రెత్తినట్లు తెలుస్తోంది. నిన్న సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట, సంగారెడ్డి పట్టణాలలో జరిగిన సీఎం కిరణ్ పర్యటన సందర్భంలో జగ్గారెడ్డి నిర్వహించిన పలు కార్యక్రమాలకు అవినాష్ అడుగడుగునా భద్రత పేరిట అడ్డుతగలడం జగ్గారెడ్డికి మరింత కోపాన్ని తెప్పించింది. సీఎంకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలనీ, డీజే సౌండ్ సిష్టం వద్దనడం, సంగారెడ్డి గెస్ట్ హౌజ్ ముందున్న ఓ విగ్రహానికి పూల మాల వేసే కార్యక్రమం వద్దనడం, బైక్ ర్యాలీకి వస్తున్న కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి ఝలిపించడం...సౌండ్ సిష్టం ఉన్న వాహనాలను సీజ్ చేయించడంతో కార్యకర్తలు తీవ్ర అసంత్రుప్తికి లోనై పోలీసుల తీరును జగ్గారెడ్డికి చెప్పారు. దీనిని సీరియస్ గా తీసుకున్న జగ్గారెడ్డి నేరుగా సీఎం వద్దకు వెళ్లి ఎస్పీ తీరుపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కార్యకర్తల ఉత్సహానికి అడ్డు తగిలే విధంగా ఎస్పీ తన ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారనీ, ఇలా అయితే తనకు కార్యకర్తల నుంచి ఇబ్బందులు ఏర్పడుతాయనీ సీఎంకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. జగ్గారెడ్డి సీఎంకు ఫిర్యాదు చేయడంతో ఎస్పీ అవినాష్ మహంతిని గెస్ట్‌హౌస్‌లోకి పిలిపించి, ఎమ్మెల్యే ఏర్పాట్లకు అడ్డుచెప్పొద్దంటూ ఆదేశించడంతోపాటు ఎస్పీ తీరుపై సీఎం కూడా కొంత అసహనం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎస్పీ తీరుపై గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కూడా కోపంగా ఉన్నారు. జిల్లాలోని అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఎస్పీ తీరుపై మండిపడుతున్నారు. తాజాగా సీఎంకు అత్యంత సన్నిహితుడైన జగ్గారెడ్డి ఏకంగా ఎస్పీ తీరుపై సీఎంకు ఫిర్యాదు చేశారు. జగ్గారెడ్డి ఫిర్యాదుతో ఎస్పీని సీఎం మందలించినట్లు తెలుస్తోంది. రేపోమాపో జరుగుతాయంటున్న ఐపీఎస్ ల బదలీలో అవినాష్ బదలీ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనీ తెలుస్తోంది.      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: