సంగారెడ్డి: ముఖ్యమంత్రి కిరణ్ తో అమితుమీకి సిద్ధపడ్డ డిప్యూటీ సీఎం రాజనర్సింహ ప్రస్తుతానికి మొత్తబడ్డట్లే కనిపిస్తోంది. మెదక్ జిల్లాకు చెందిన ఎంపీ షెట్కార్, ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి నెరపిన దౌత్యమో లేక డిప్యూటీ సీఎం అడిగిన సింగూరు ప్రాజెక్టుకు నిధుల విడుదలనో మొత్తానికి తెలియదు కానీ డిప్యూటీ-సీఎం ఇద్దరు ఒకటైనారు. అంతేకాదు, ఈ నెల 29న మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తలపెట్టిన ఇందిరమ్మ బాటలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎం, ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహకి సయెద్య కుదరడంతో అందోల్ నియోజకవర్గాన్ని కూడా ఇందిరమ్మబాటలో చేర్చారు. ఇదివరకు ప్రకటించిన ఇందిరమ్మ బాట షెడ్యూల్లో రాజనర్సింహ నియోజకవర్గమైన అంధోల్ లేదు.
సీఎంను డిప్యూటీ కలిశాక ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త రోడ్డు మ్యాపును ప్రకటించారు. ఇది వరకు ఉన్న షెడ్యూలుకు, సీఎంను డిప్యూటీ కలిసిన తరువాత పూర్తిగా మారనున్నది. రాజనర్సింహ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆందోల్ నియోజకవర్గంలో సింగూరు ప్రాజెక్టు వుంది. ఈ ప్రాజెక్టు పనుల నిమిత్తం నిధులను మంజూరు చేయడంతో పాటు...ఈ ప్రాజెక్టుకు తన తండ్రి పేరు పెట్టాలనీ రాజనర్సింహ పట్టుబడుతున్నారు. దీనికి సంబంధిత మంత్రి సుదర్శన్ రెడ్డి మెలికపెట్టారు. సుదర్శన్ రెడ్డి పెట్టిన మెలికకు సీఎం కిరణ్ కూడా పరోక్షంగా మద్దతు పలుకుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం-డిప్యూటీ మధ్య ఉన్న విభేదాలు మరింత పతాక స్థాయికి చేరుకున్నాయి. తన ప్రమేయం లేకుండా, తన జిల్లాలో ఇందిరమ్మ బాటకు ముఖ్యమంత్రి ఎలా వస్తారనీ రాజనర్సింహ గరంగరం అయ్యారు.
సీఎం తీరుపై ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేస్తాననీ హెచ్చరించారు. అయితే, ఈ క్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలు జోక్యం చేసుకుని ఇరువుర్ని ఫోన్లో మాట్లాడించారనీ తెలుస్తోంది. డిప్యూటీ కోరినట్లుగానే సింగూరు ప్రాజెక్టుకు కావల్సిన 19కోట్ల నిధులను మంజూరు చేస్తూ సీఎం ఉత్తర్వులను జారీ చేశారు. తాను కోరిన విధంగా సీఎం నిధులు మంజూరు చేయడంతో డిప్యూటీ కూడా మెట్టు దిగారు. 29నుంచి తలపెట్టిన ఇందిరమ్మ బాటలో భాగంగా ఆందోల్ నియోజకవర్గానికి రావల్సిందిగా ఆహ్వానించారు. దీనికి సీఎం కూడా అంగీకరించారు. ఆ దిశగా కొత్త రోడ్డు మ్యాపును ప్రకటించారు. ఏది ఏమైనా డిప్యూటీ అడిగిన నిధులను సీఎం మంజూరు చేయడంతో సీఎం-డిప్యూటీ మధ్య నెలకొన్న లొల్లి సద్దుమణిగిందనీ చెప్పాలి. ఇద్దరూ కలిసిపోవడంతో అటు అధికారులు, ఇటు పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఏమైనా డిప్యూటీ తాను పట్టుపట్టి నిధుల్ని సాధించుకోవడం కొసమెరుపు.
మరింత సమాచారం తెలుసుకోండి: