కమ్మ వర్గానికి ఆ వైసీపీ ఎమ్మెల్యే భయపడుతున్నారా ? వైసీపీలో టాక్
ఈ క్రమంలో మంత్రి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఉమా ధీటుగా స్పందించారు. దమ్ముంటే.. వచ్చి టచ్ చేయాలని సవాల్ రువ్వారు. ఈ క్రమంలోనే విజయవాడ శివారులోని గొల్లపూడిలో నిరసన దీక్షకు దిగారు. అయితే.. దీనిని పోలీసులు భగ్నం చేయడం.. దేవినేనిని అరెస్టు చేయడం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ ప్రాంతంతో సంబంధం లేని.. గన్నవరం ఎమ్మెల్యే వంశీ వచ్చి.. దేవినేనిపై మరింత ఫైరయ్యారు. అదేసమయంలో మంత్రి కొడాలినానికి అనుకూలంగా కామెంట్లు చేశారు. దేవినేని ఏదైనా స్టూడియోకు వచ్చి చర్చించాలని వంశీ కూడా ఫైరయ్యారు.
కానీ, ఇదే సమయంలో మైలవరం నుంచి విజయం సాధించిన వసంత కృష్ణప్రసాద్ మాత్రం అసలు ఈ విషయంలో వేలు పెట్టలేదు. తనకు ఈ విషయం తెలియదు.. అన్నట్టుగా మౌనంగా ఉన్నారు. ఇదే ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. నానికి దన్నుగా నిలుస్తారని.. పైగా తన నియోజకవర్గంలో తన ప్రత్యర్థి విషయంలో మరింత దూకుడుగా ఉంటారని భావించిన కృష్ణప్రసాద్ ఎందుకు మౌనంగా ఉన్నారనే విషయంపై వైసీపీ నాయకులు దృష్టి పెట్టారు. తీరా వారికి తెలిసిన విషయం ఏంటంటే.. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం.. ఇప్పుడు దేవినేనికి అనుకూలంగా ఉంది.
గత ఎన్నికల్లో కమ్మ వర్గం నేతలు చాలా మంది దేవినేనిపై వ్యతిరేకతతో కేపీకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు దేవినేనిని టార్గెట్ చేసి కమ్మలకు వ్యతిరేకం అయ్యేందుకు కేపీ ఇష్టపడడం లేదట. అదే సమయంలో తమకేదో చేస్తారని అనుకున్న కేపీ.. ఏమీ చేయకపోవడంతో వారంతా ఇప్పుడు ఎమ్మెల్యేపై ఆగ్రహంతో ఉన్నారు. దీంతో దేవినేని అయితేనే బెటర్ అనుకునే పరిస్థితి ఏర్పడింది. దీనిని గ్రహించిన కేపీ.. ఇప్పుడు దేవినేని వర్సెస్ నాని విషయంలో వేలు పెడితే.. మొదటికే మోసం వస్తుందని భావించి.. మౌనంగా ఉన్నారని వైసీపీ నాయకులు తేల్చేశారు. అయితే.. కేపీ ఇలా వ్యవహరించడాన్ని వీళ్లు తప్పుపడుతుండడం గమనార్హం. మొత్తానికి నాని, దేవినేనిల వివాదం కేపీ మెడకు చుట్టుకుందని ఆయన అనుచరులు చెబుతున్నారు.