నంబర్ వన్ రాష్ట్రంగా చేస్తా:బాబు

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రశస్తమైన రాగి సంకటి, నాటుకోడి పులుసు తదితర వంటకాలకు అంతర్జాతీయస్థాయిలో బహుళ ప్రాచుర్యం దక్కేలా చూస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. సాంస్కృతికంగా, వారసత్వపరంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజాశక్తి తెలుగు దినపత్రిక 34వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ విభాగం ‘నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి’పై ప్రచురించిన ప్రత్యేక సంచికను చంద్రబాబు మంగళవారం లేక్ వ్యూ అతిధి గృహంలోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధి తన ఆకాంక్ష అని చెప్పారు. తెలంగాణలో ఎస్‌ఎల్‌బీసీ, దేవాదుల ప్రాజెక్టుల పూర్తికి ఎంత కష్టపడ్డానో తనకే తెలుసన్నారు. 40 లక్షల ఫించనుదారులకు ప్రతి నెలా వారి ఫించనుకు సంబంధించిన సమాచారం వొడాఫోన్ ద్వారా సంకిప్త సమాచారం రూపంలో తెలియచేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో సహజవనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవటం ద్వారా దేశంలోనే నెంబర్‌వన్ రాష్ర్టంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మౌలికసదుపాయాల అభివృద్ధిపైనే పూర్తి దృష్టిని కేంద్రీకరిస్తున్నామని, అందుకే ఓడరేవులు, విమానాశ్రయాల అభివృద్ధిని చేపడుతున్నామని చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్ చంద్రబాబు సారధ్యంతో భవ్యాంధ్రప్రదేశ్‌గా రూపొందుతుందని ప్రజాశక్తి ఆంధ్రప్రదేశ్ విభాగం సంపాదకులు తెలకపల్లి రవి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి సాహితీ సంస్థ ఛైర్మన్ వి.కృష్ణయ్య, చీఫ్ జనరల్ మేనేజర్ ప్రభాకర్, ఏపీ ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమ హబ్‌గా విశాఖ: బాబ --------------------------------------- సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం ప్రాంతాన్ని చిత్ర పరిశ్రమ హబ్‌గా రూపొందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనను కలవడానికి వచ్చిన చిత్ర పరిశ్రమ ప్రముఖులకు హామీనిచ్చారు. మంగళవారం లేక్‌వ్యూ అతిథిగృహంలోని క్యాంప్ కార్యాలయంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు రవి కొటార్కర్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ల ప్రతినిధులు అశోక్ కుమార్, దేవరాజ్, మురళీధర్, నిర్మాతల మండలి ప్రతినిధులు సి. కల్యాణ్, కాట్రగడ్డ ప్రసాద్ తదితరులు సీఎంను కలిశారు. చక్కెర పరిశ్రమ సమస్యలు పరిష్కరిస్తాం చక్కెర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటంతో పాటు రైతులను ఆదుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. చక్కెర పరిశ్రమను లాభసాటిగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం కేసీపీ చక్కెర పరిశ్రమ ప్రతినిధులు శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, పెనమలూరు ఎమ్మెల్యే బడే ప్రసాద్ నే తృత్వంలో సీఎంను కలిశారు. ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌కు సదుపాయాలు కల్పించండి తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు, సదుపాయాలు వెంటనే కల్పించాల్సిందిగా సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: