నిర్భయ తరహా ఘటన.. 50ఏళ్ల మహిళను..!

NAGARJUNA NAKKA
నిర్భయ తరహా ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. బదౌన్‌ జిల్లాలో మానవ మృగాళ్ల అకృత్యానికి 50ఏళ్ల మహిళ బలయింది.  దేవుడి దర్శనానికి వెళ్లివస్తున్న మహిళలపై సామూహిక అత్యాచారం జరిపిన దుండగులు అతి కిరాతకంగా ప్రవర్తించారు. పక్కటెముకలు, కాళ్లు విరగొట్టి.. వ్యక్తిగత అవయవాలను దారుణంగా గాయపర్చారు. గత ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఎన్ని చట్టాలు వచ్చినా... మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. నిర్భయ లాంటి చట్టాలు ఉన్నా... ఆడవాళ్లపై అకృత్యాలు మాత్రం ఆగడంలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బదౌన్‌ జిల్లా లో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న 50ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. ఈ నెల 3న దేవుడి దర్శనం కోసం స్థానిక ఆలయానికి వెళ్లింది బాధితురాలు. ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊరంతా గాలించారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఆలయ పూజారి మరో ఇద్దరు కలిసి తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న మహిళను ఇంటికి తీసుకొచ్చినట్లు ఆమె కుమారుడు తెలిపారు. ఏమైందని పూజారిని ప్రశ్నించగా.. ఆ మహిళ బావిలో పడిపోయిందని.. అరుపులు విని రక్షించామని చెప్పి వెళ్లిపోయారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావమైన ఆ మహిళ ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతిచెందింది.
మృతదేహానికి పోస్ట్‌మార్టం జరపగా షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆమెను తీవ్రంగా గాయపర్చినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. మహిళ పక్కటెముకలు, కాళ్లను విరగ్గొట్టారు మృగాళ్లు. ఊపిరితిత్తులపై బలమైన వస్తువుతో గాయపర్చినట్లు తేలింది. ఆమె వ్యక్తిగత అవయవాలను కూడా దారుణంగా గాయపర్చినట్లు నివేదిక పేర్కొంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆలయ పూజారి, మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా... మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
తమ తల్లి మృతికి కారణమైన వారికి ఉరిశిక్ష విధించాలని కోరుతున్నారు మృతురాలి కుమారుడు. ఈ ఘటన మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. బడిలో, గుడిలో ఎక్కడా మహిళకు రక్షణ లేకుండా పోతోందని మండిపడుతున్నారు. బదౌన్‌ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: