బీజేపీలో షాడో వైసీపీ నేత‌.. జీవీఎల్‌పై కామెంట్లు నిజ‌మేనా...?

VUYYURU SUBHASH
బీజేపీ నాయ‌కుడు, కేంద్ర స్థాయిలో చ‌క్రం తిప్ప‌గ‌లిగిన నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావుపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నాయ‌కుడైన జీవీఎల్‌.. వైసీపీకి ఫేవ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త కొన్నాళ్లుగా జీవీఎల్ అనుస‌రిస్తున్న వైఖ‌రిని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు.. ప్ర‌శ్నిస్తున్నారు. గ‌తంలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, ప్ర‌స్తుతం సోము వీర్రాజులు రాష్ట్రంలో బీజేపీ బ‌లోపేతం అయ్యేందుకు త‌మ వంతు కృషి చేస్తున్నారు. అయితే.. వారు ఎప్పుడు పుంజుకుంటున్నా.. ఆస‌మ‌యంలో రాష్ట్రంలో వాలిపోతున్న జీవీఎల్‌.. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న వాతావ‌ర‌ణాన్ని యూట‌ర్న్ తీసుకునేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది నెటిజ‌న్ల అభిప్రాయం.

గ‌తంలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లుపుకొని పోయేందుకు ప్ర‌య‌త్నించారు. మ‌రీ ముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ప్ర‌జ‌ల‌కు ఉన్న సందేహాల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య త్నించారు. అదేస‌మ‌యంలో బీజేపీ వైపు ప్ర‌జ‌లు మ‌ళ్లేలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పార్టీ త‌ర ‌ఫున ప‌లుమార్లు.. అమ‌రావ‌తి ప్రాంతానికి వెళ్లి.. అక్క‌డ ప్ర‌జ‌ల‌కు మ‌ద్దతు ప్ర‌క‌టించారు. ఆ స‌మ‌యంలో జోక్యం చేసుకున్న జీవీఎల్‌.. రాజ‌ధాని విష‌యం కేంద్రం ప‌రిధిలో లేద‌ని బ‌లంగా వాదించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఇష్ట‌మేన‌ని చెప్పుకొచ్చారు. ఇది ప‌రోక్షంగా వైసీపీకి మేలు చేయ‌గా.. ప్ర‌త్యక్షంగా బీజేపీకి అత్యంత దారుణ‌మైన ప‌రిస్థితిని తీసుకువ‌చ్చింది.

ఇక‌, తాజాగా సోము వీర్రాజు బీజేపీ ప‌గ్గాలు  చేప‌ట్టిన త‌ర్వాత‌.. రాజ‌ధాని ఉద్య‌మాన్ని స‌మ‌ర్ధిస్తూనే.. అక్క‌డికి వెళ్లారు. అక్క‌డి రైతుల‌తోను, మ‌హిళ‌ల‌తోనూ మమేక‌మ‌య్యారు. రాజ‌ధాని నిర్ణ‌యానికే బీజేపీ నేత‌లుగా తాము క‌ట్టుబ‌డ‌తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు బీజేపీని వ్య‌తిరేకించిన రైతాంగం మ‌ళ్లీ.. మ‌రోసారి.. బీజేపీవైపు మొగ్గు చూపాయి. కానీ, ఇంత‌లోనే మ‌ళ్లీ అస‌లు సమ‌యం, సంద‌ర్భం కూడా లేకుండా జీవీఎల్ జోక్యం చేసుకుని.. మ‌ళ్లీ రాజ‌ధాని విష‌యంలో కేంద్రం పాత్ర లేదంటూ.. వ్యాఖ్య‌లు సంధించారు. నిజానికి ఇప్పుడు రాజ‌ధాని గురించిన టాపిక్ రాష్ట్రంలో న‌డ‌వ‌డం లేదు. ప్ర‌స్తుతం ఆలయాల‌పై దాడులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర స‌ర్కారుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఈ క్ర‌మంలో.. జీవీఎల్ అనూహ్యంగా రాజ‌ధాని విష‌యాన్ని మ‌రోసారి తెర‌మీదికి తెచ్చి.. వ్యూహాత్మ‌కంగా ఆల‌యాల‌పై జ‌రిగిన దాడుల అంశాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేశారు. ఇది బీజేపీకి న‌ష్టం క‌లిగించే ప‌రిణామం కాగా, వైసీపీకి మేలు చేసే అవ‌కాశం ఉంద‌నేది నెటిజ‌న్ల మాట‌. ఈ క్ర‌మంలోనే జీవీఎల్‌పై సోష‌ల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీలో షాడో వైసీపీ నేత‌.. జీవీఎల్ అంటూ.. నెటిజ‌న్లు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మ‌రి ఇది నిజ‌మేనా?  భ‌విష్య‌త్తులో ఏం తేలుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: