హైదరాబాద్: అవిశ్వాస తీర్మానంపై రాష్ర్టంలో మళ్లీ కొత్తగా రాజకీయ చర్చకు తెరలేచింది. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కావల్సినంత బలం ఉన్న వాళ్లు ససేమిరా అంటున్నారు. ఏమీ బలం లేని వారు అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతు ఇస్తామంటున్నారు. ప్రస్తుతం రాష్ర్టంలో అవిశ్వాస తీర్మానం టీడీపీ-వైఎస్ఆర్ సీపీల మధ్యన హాట్ హాట్ టాపిక్ గా నడుస్తోంది. ప్రభుత్వం తన కర్తవ్యాన్ని మరిచినప్పుడు ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెట్టడం ప్రధాన ప్రతిపక్షానికి ఉన్న ఏకైక ఆయుధం. ప్రజల విశ్వాసాన్ని అధికార పక్షం కోల్పోయిందనుకున్నప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రభుత్వాన్ని పడగొట్టాలి. కానీ, రాష్ర్టంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రజలు అనేక అవస్థలు పడుతున్నా కూడా ప్రధాన ప్రతిపక్షం పెట్టాల్సిన సమయంలో అవిశ్వాస తీర్మానం పెట్టలేకపోతుందనీ సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ర్ట ప్రజలు ఆపదలో ఉన్నారనీ, వారి సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికే 63ఏళ్ల వయసులోనూ తాను పాదయాత్ర చేస్తున్నట్లు చంద్రబాబు చిలుకపలుకులు పలుకుతున్నారు. అయితే, అదే ప్రజల కోసం అవిశ్వాస తీర్మానం పెట్టాలనీ వైఎస్ఆర్ సీపీ నేతలు అంటుంటే...తమ్ముళ్లు ఎనలేని కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. తాము ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే...దానిని వైఎస్ఆర్ సీపీ అడ్డుపెట్టుకుని ఢిల్లీస్థాయిలో కాంగ్రెస్ తో లబ్దిపొందాలనీ చూస్తుందనీ తమ్ముళ్ల ప్రధాన ఆరోపణ.తమ్ముళ్లు అంటున్నట్లుగా వైఎస్ఆర్ సీపీ కాంగ్రెస్ తో రాయభేరాలు, బేరాలు చేస్తుందే అనుకుందాం. బాబు అంత ఆయాస పడుతూ పాదయాత్ర చేయడం దేనికి? ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారనే కదా బాబు కళ్లకు ఇన్ఫెక్షన్ అయినా, అలసి సొలసి కింద పడుతున్నా మళ్లీ లేస్తూ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
గత ఏడు నెలల కిందట కూడా రైతు సమస్యలపై అవిశ్వాస తీర్మానం పెట్టాలనీ వైఎస్ఆర్ సీపీ సవాల్ విసిరినప్పుడు కూడా టీడీపీ ఇవే మాటలు మాట్లాడింది. కానీ, అవిశ్వాస తీర్మానం సందర్భంగా అ‘విశ్వాసానికి’ మద్దతుగా జగన్ వర్గీయులు 17మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేసి తమ పదవీని పోగొట్టుకున్నారు. అవిశ్వాసం పెట్టిన టీడీపీకి ఎలాంటి నష్టం జరగలేదు. పై పైచ్చు టీడీపీ అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఢోకా లేదనీ నిరూపణ చేసింది. వాస్తవాలు ఇలా ఉంటే, టీడీపీ మాత్రం జగన్ బెయిల్ కోసమే అవిశ్వాసం పెట్టాలనీ వైఎస్ఆర్ సీపీ నాయకులు అంటున్నారనీ....ప్రజలపై ప్రేమ ఉంటే వైఎస్ఆర్ సీపీయే అవిశ్వాస తీర్మానం పెట్టాలనీ ఎదురు ప్రశ్నిస్తున్న తీరు అంత సమంజసంగా లేదు. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడానికే వైఎస్ఆర్ సీపీకి అసెంబ్లీలో అంత బలం లేదు. అలాంటప్పుడు అవిశ్వాస తీర్మానం ఎలా పెడుతారు? ప్రజల కోసమే టీడీపీ రాజీలేని పోరాటం చేస్తుందంటూ ఓ వైపు పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెడితే వచ్చే నష్టమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.
కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కుమ్మక్కు కాకుంటే అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టదనీ విజయమ్మ ప్రశ్నిస్తోంది. బాబు స్నేహహస్తాన్ని అందించకపోతే ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయేదనీ వైఎస్ఆర్ పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, అంబటి రాంబాబు అంటున్నారు. దీనిపై టీడీపీ నేతలు పయ్యవుల కేశవ్, రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగన్ బెయిల్ కోసమే అవిశ్వాస తీర్మానం డ్రామా ఆడుతున్నారనీ అంటున్నారు. జగన్ జెైలు ములాఖత్ గుట్టువిప్పాలన్న అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో వైఎస్ఆర్ కూడా కొంత ఇబ్బందుల్లో పడ్డది. ఏది ఏమైనా రాష్ర్టంలోని ప్రతిపక్ష పార్టీలు పోషించాల్సినంత పాత్రను పోషించడం లేదు. కేవలం వారి రాజకీయ లబ్ది కోసం, కేసుల నుంచి బయటపడటం కోసమే ఆలోచిస్తున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ సర్కార్కు వెయ్యి ఏనుగుల బలమవుతోంది. ఈ ప్రతిపక్షాలున్నన్ని రోజులు కిరణ్ సర్కార్కు వచ్చిన ముప్పేమీ లేదు.
మరింత సమాచారం తెలుసుకోండి: