పదవులు ఇవ్వాలే కానీ తీసుకునేందుకు పోటీపడే నాయకులకు కొదవ ఉండదు. తమ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, తమకు ఏదో ఒక నామినేటెడ్ పదవి వస్తుందని, ఓ మోస్తరు నాయకుడు నుంచి బడా నాయకులంతా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. దీనికి తగ్గట్టుగానే గ్రామ, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నో రకాలైన నామినేటెడ్ పదవులు భర్తీ చేసుకునేందుకు, వాటిలో తమకు నచ్చిన వారిని కూర్చోబెట్టేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ మాత్రం తమ పార్టీ అధికారంలో ఉన్నా, నామినేటెడ్ పదవులను భర్తీ చేసే విషయంలో పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులను భర్తీ చేసే పనిని స్పీడ్ చేసింది. నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం అంటే కత్తి మీద సాము అని, ఎవరికి పదవి కేటాయించినా, మరికొందరు అసంతృప్తికి గురవుతారని భావించే ఈ పదవులు భర్తీని వీలైనంత వరకు వాయిదా వేసుకుంటూ నే వస్తుంటాయి.
అదేవిధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఈ పదవుల భర్తీ చేయకుండా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.కానీ ఇప్పుడు అకస్మాత్తుగా తెలంగాణలో బీజేపీ బలపడుతుందని, టిఆర్ఎస్ నాయకులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న పరిణామాలు వంటి కారణాలతో టిఆర్ఎస్ లో ఆందోళన పెరిగిపోతుంది. తమ పార్టీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందా లేదా అనే అనుమానం పెరిగిపోతుండడంతో పాటు పక్క చూపులు చూసే నాయకుల సంఖ్య పెరిగిపోతుండడంతో కేసీఆర్ అకస్మాత్తుగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట. పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పకుండా పదవులు వస్తాయని సంకేతాలు పంపిస్తూ ఇప్పుడు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ముందుగా రాష్ట్ర మహిళా కమిషన్ ను నియమించారు .మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ని చైర్ పర్సన్ గా నియమించారు. ఇక వరుసబెట్టి నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టి, పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సాహం తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు కనిపిస్తున్నారు