డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదు...!

NAGARJUNA NAKKA
దేశద్రోహులన్నారు. ఖలిస్తానీ టెర్రరిస్టులని పిలిచారు. మహాత్ముడికి వ్యతిరేకులనే ముద్ర వేశారు. ఉద్యమంలో తీవ్రవాదులు ఉన్నారని ఆరోపించారు. ఉద్యమం కాదిది నడిరోడ్ల మీద అరాచకం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఎవరేమన్నా... ఎన్ని రకాల విమర్శలు చేసినా.. అన్నదాతలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తమ లక్ష్యం మీదనే దృష్టి సారించారు. ఐదు దఫాలుగా కేంద్రంతో చర్చలు జరిగినా... కేంద్ర ప్రభుత్వం, సర్వోన్నత న్యాయస్థానం రకరకాల ప్రతిపాదనలు చేసినా.. వాళ్ల మాట ఒక్కటే. చట్టాల్ని వెనక్కి తీసుకోవాలన్నదే రైతుల డిమాండ్. 25 రోజులుగా వాళ్ల డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదు.
పంజాబ్‌లో భగత్ సింగ్ మామ అజిత్ సింగ్ నేతృత్వంలోని 1907 నాటి 'టర్బన్ సంబల్ జట్టా' ఉద్యమం, విదేశీ పాలన, సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా అన్ని దేశభక్తి ఉద్యమాల ప్రేరణ పొందింది ప్రస్తుతం రైతులు చేస్తున్న పోరాటం మాది. ఇటీవల రైతు సంఘాల నేతలు కేంద్ర వ్యవసాయ మంత్రికి రాసిన లేఖలో కొంతమంది బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు రైతుల సమాధానం ఇది. కొంతమంది కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నా రైతుల సంయమనంతోనే వ్యవహరిస్తున్నారు. రామ్‌లీలా మైదానంలోకి రానిచ్చేది లేదని ప్రభుత్వం తెగేసి చెప్పడంతో... ఢిల్లీ సరిహద్దుల్లోనే ఎక్కడి వాళ్లక్కడే పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.
చట్టాలను వ్యతిరేకించేవాళ్లు.. చట్టాలకు అనుకూలంగా మాట్లాడే వాళ్లు పదునైన వాదనలు వినిపించారు. ఎవరి వాదననూ కాదనలేని పరిస్థితి. చట్టాలతో మేము నష్టపోతామని రైతులు చెబుతుంటే.. కాదు లాభపడతారని అంటోంది ప్రభుత్వం. రెండు వైపులా పదునున్న కత్తి లాంటి సమస్య ఇది. 25 రోజుల పోరాటంలో 21 మంది రైతుల్ని కోల్పోయింది ఈ ఉద్యమం. సింఘు బోర్డర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో దీపాలు వెలిగించి చనిపోయిన రైతులకు శ్రద్దాంజలి అర్పించాయి రైతు సంఘాలు. సహచరుల ప్రాణాలు పోతున్నా.. అన్నదాతలు సహనంతో వ్యవహరిస్తున్నారు. లక్ష్యాన్ని సాధించాలన్నదే వారి ఉద్దేశం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: