గ్రేటర్ యుద్ధం: ఓట్ బ్యాంకు పెంచుకున్న మజ్లిస్..!
మజ్లిస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీలతో పాటు ఎమ్మెల్యేలు మంతాజ్ అహ్మద్ ఖాన్, సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, మోజంఖాన్ తీవ్రంగా కృషి చేశారు. వారి కృషి ఫలితంగా నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో ఎంఐఎం కైవసం చేసుకుంది. నియోజక వర్గంలోని అన్ని డివిజన్లలో మజ్లిస్ పార్టీ అభ్యర్థులు 73,497 ఓట్లు సాధించారు. ఎంతో హడావుడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ, టీఆర్ఎస్ కు ఈ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ,రాష్ట్ర స్థాయి ప్రముఖులు పాతబస్తీలో పర్యటన నిర్వహించారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. ఈ ఎన్నికల్లో తమదే విజయమంటూ ఓవైసీ సోదరులకు సవాలు విసిరిన టీఆర్ఎస్ పార్టీకి చార్మినార్ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో ఓట్లు లభించలేదు. ఏ ఒక్క అభ్యర్థి విజయం సాధించకపోగా.. డివిజన్ల వారీగా టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అతి తక్కువ ఓట్లు నమోదయ్యాయి. మారిన సమీకరణాల నేపథ్యంలో 2016 ఎన్నికల్లో ఘాన్సీబజార్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మహ్మద్ గౌస్ భార్య పర్వీన్ సుల్తానాకు 2,575 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి.
ఈ ఎన్నికల్లో 14,377 ఓట్లతో 5,468 మెజార్టీ సాధించి గెలుపొందారు. మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు కోసం ఎదురు చూడకపోయినా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో చార్మినార్ నియోజవకర్గంలోని ఓటర్లు టీఆర్ఎస్ అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటు వేస్తారనుకున్న నాయకులకు నిరాశే మిగిలింది. మొత్తం మీద చార్మినార్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు 6,854 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 2016 ఎన్నికల్లో టీఆర్ఎస్కు 11,359 ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభావం చాలావరకు తగ్గిందనే చెప్పుకోవచ్చు.
2016లో నియోజకవర్గంలో పార్టీల వారీగా పోలైన ఓట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఎంఐఎం పార్టీకి 54,881. బీజేపీకి 16,659. టీఆర్ఎస్ పార్టీకి 11,359. కాంగ్రెస్ పార్టీకి 13,320 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి 73,497. బీజేపీకి 22,595. టీఆర్ఎస్కు 6,854. కాంగ్రెస్ పార్టీకి 1,768 ఓట్లు పోలయ్యాయి.