జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిశాయి. ప్రధాన పార్టీలన్నీ చావో రేవో అన్నట్టుగా సాగాయి. అందివచ్చిన కాడికి వాడుకున్నాయి. కానీ, జీఎహెచ్ఎంసీ అభ్యర్థులకు ఓటర్లు పెద్ద షాక్ ఇచ్చారు. సగానికి పైగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకే రాలేదు. దీంతో చాలా తక్కువ ఓట్లు పోలయ్యాయి. ఇదే ఇప్పుడు ప్రధాన పార్టీల్లో టెన్షన్ రేపుతోంది.
ఈ ఓట్లు ఎవరికి పడ్డాయి. ఈ కొద్దిమంది మేయర్ పీఠానికి ఎవరిని దగ్గర చేస్తున్నారు.. తక్కువ ఓటింగ్ ఎవరికి కలిసి రానుంది అన్న ప్రశ్నలు వాటిని వేధిస్తున్నాయి. చాలా తక్కువగా ఓట్లు పోల్ కావడంతో విజయంపై ఎవరూ కచ్చితంగా లేరు. అయితే, జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ సర్కారు ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన కుటుంబాలను ఆదుకునేందుకు రూ.పదివేల చొప్పున ఆర్థిక సాయం చేసింది.
అయితే ఇందులో అనేక అవకతవకలు జరిగాయని విమర్శలొచ్చాయనుకోండి అది వేరే సంగతి. సాయం ఆపాలని బీజేపీ బాస్ బండి సంజయ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారని టీఆర్ఎస్, ఆ లేఖ తాను రాయలేదని, టీఆర్ఎస్ కావాలనే తమపై అభాండాలు వేస్తుందని బీజేపీల మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది.
ఇంకా చాలామందికి సాయం అందించాల్సిన తరుణంలో ఎన్నికల సంఘం ఈ సాయాన్ని నిలిపేవేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సాయం నిలిచిపోయింది. అయితే, ఆర్థిక సాయం అందని పేదలు తమ వద్దకు ప్రచారానికి వచ్చిన అధికార పార్టీ నేతలను, ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. ఈ తరుణంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. చాలా తక్కువ ఓటింగ్ పోలైనా.. విజేతను నిర్ణయించేది మాత్రం ముంపు బాధితులేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది.నగరంలో సాయం అందిన వారికంటే అందని వారే ఎక్కువగా ఉన్నారు. సాధారణంగా సాయం అందినవారు ప్రభుత్వానికి అనుకూలంగా, అందని వారు వ్యతిరేకంగా ఉంటారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఓటు వేసిన వారు సాయం అందనివారు ఎక్కువగా ఉంటే టీఆర్ఎస్‌కు నష్టమని, సాయం అందుకున్న వారుంటే కారు పార్టీకి లాభమని.. ఇవే ఈ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయిస్తాయని రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఆ రూ. పదివేలే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఎవరి అంచనాలు ఫలిస్తాయో తేలాలంటే నాలుగో తేదీ దాకా ఆగాల్సిందే.